‘సాయిచంద్ లేని సభను ఊహించలేం!! రాళ్లను సైతం కరిగించే గొంతు సాయిద’ని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం కన్నీళ్లు ఉబికివస్తుంటే గద్గద స్వరంతో మంత్రి కేటీఆర్ చెప్పిన మాట అక్షరసత్యం!
ఉద్యమ శిఖరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సైతం కదిలించిన గానం, గాత్రం సాయిది! పుస్తకానికి ముందుమాట ఎలాగో కేసీఆర్ సభకు మా సాయిది ముందుపాట. అలాంటి సాయి పాట లేని సభను ఊహించలేం. ఒక్కమాటలో చెప్పాలంటే.. పాట కన్నబిడ్డ సాయిచంద్!
గులాబీ సైనికుడు సాయిచంద్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. సాయి కుటుంబాన్ని కడుపులో పట్టుకుని కాపాడుకుంటాం. సాయిచంద్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఒక కోటి యాభై లక్షల రూపాయల ఆర్థికసాయం ప్రకటించారు. సాయిచంద్ సతీమణి రజినిని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్ పర్సన్‌గా నియమించడమే కాకుండా ముఖ్యమంత్రి ఆదేశాలతో నియామక పత్రాన్ని మేమే స్వయంగా వారి స్వగృహంలో అందజేయడం జరిగినది. పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తను ముఖ్యమంత్రి కేసీఆర్ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారనడానికి ఇదే తాజా ఉదాహరణ. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
సాయిచంద్ ఈ కాలానికి లభించిన అరుదైన వాగ్గేయకారుడు. అమరచింతలో ఉద్భవించిన ఆ కంఠానికి మంద్రస్థాయిలో కూడా వీర రసాన్ని పలికించడం తెలుసు. శ్రోతకు ఏ రూపంలో సందేశాన్ని అందించాలో తెలుసు. బాల్యంలోనే అమ్మను కోల్పోయి, పాటమ్మకు దగ్గరైన సాయికే తల్లి ప్రేమ విలువ అందరి కంటే ఎక్కువ తెలుసు. ఒక పాదం తర్వాత మరో పాదాన్ని బరువెక్కించి శ్రోతల హృదయాన్ని జలగీతం చేసే శక్తి అతని కలానికి ఉన్నది. కడుపు నెలపొడుపై పూసి, గర్భసంచిని ఊగే ఊయలగా మార్చిన తల్లి ఔన్నత్యాన్ని శిఖరాయమానం చేశాడు సాయి.
బహిరంగసభలో అతడి గళం గర్జిస్తుంటే, పిడికిళ్లు బిగుసుకుంటాయి. గొంతులు రణన్నినాదం చేస్తాయి. తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ పాట గొప్ప ప్రేరణ. రాష్ట్ర సాధన దిశగా ప్రజలను ఉర్రూతలూగించిన గాత్రమది! నివురుగప్పిన ఉద్యమంలోంచి నిప్పుకణికల మిణుగురులను తన పాట ద్వారా వెదజల్లిన ఉద్యమ జ్వలిత గానం సాయిది. ఉద్యమ శత్రువును మట్టి కరిపిస్తూ, ఉద్యమ శక్తుల్లో ఉడుకు నెత్తురు పారించిన సాంస్కృతిక సైనికుడు సాయి!
నాటి తెలంగాణ ఉద్యమంలో పాటతో ఉర్రూతలూపిన చైతన్య స్ఫూర్తిని, స్వయం పాలనలో కూడా కొనసాగించిన ప్రజా ఆకాంక్షల దీప్తి సాయి. ప్రగతి పాటల మాంత్రికుడు సాయి. పాటల ఊట చెలిమె సాయి. ఏ మాత్రం పదును తగ్గని ఉద్యమ భావోద్వేగం. అదే తాత్వికత జ్జానంతో సాగుతున్న పాటల ప్రవాహం. నాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ పోరాటాన్ని, నేటి సంక్షేమ పాలకుడి ప్రగతిబాటను
సామాన్యుల చెంతకు చేర్చిన ద్రష్ట సాయిచంద్!
సాయిచంద్ ఆటాపాటా లేకుండా ముఖ్యమంత్రి సభ లేదంటే అతిశయోక్తి కాదు. ఎన్ని గంటలైనా అలసిపోకుండా తన గాన ప్రవాహంతో జన సందోహాన్ని మంత్రముగ్ధులను చేస్తూ ముందుకుసాగేది సాయి స్వరం. సీఎం కేసీఆర్ రాకకు పూర్వరంగాన్ని సిద్ధం చేస్తూ సాగే పాటకు ప్రజా సమూహం లయాత్మకంగా ఉర్రూతలూగేది. పాటలోని ప్రాసంగికతను, దాని పరమార్థాన్ని అర్థం చేయిస్తూ సాగే గాత్ర కచేరి సాయిచంద్ ధూంధాం!
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ఎందుకు గొప్పదో.. దానిలోని లోతు ఏమిటో ప్రజలకు వివరిస్తూ తన మాట, పాట పరవశులను చేస్తుంటే.. సభలో ఆ కొస నుంచి ఈ కొస దాకా చప్పట్లతో దద్దరిల్లేది! ఎంత పెద్ద సభయినా.. ఎన్ని లక్షల మందినైనా తన పాటకు ప్రజలను ట్యూన్ చేసిన ఘనత సాయిచంద్కే దక్కుతుంది. ప్రసంగంతో కూడిన పాట.. పాటతో కూడిన ప్రసంగం జుగల్బందీగా సాగేపోయేది! లక్షలాది మందికి భరోసానిచ్చేలా చప్పట్లు కొట్టించిండు. సీఎం కేసీఆర్ రాక ఆలస్యమైనా… మన సాయిచంద్ ఉన్నాడులే అనే భరోసా పార్టీ నేతలకు శ్రేణులకు కలిగేదంటే.. అతిశయోక్తి కాదు. అంతటి భరోసా కల్పించింది సాయిచంద్ పాట!
సాధించుకున్న తెలంగాణలో రైతులు.. పేదలు.. సబ్బండవర్గాల సంక్షేమమే లక్ష్యంగా సాగే ప్రజా పాలన కూడా ఒక ఉద్యమమేనంటూ పాటల మాల కట్టిండు సాయి! రాష్ట్ర సాధన కోసం తన తోటి యువకుల తనువులను నిర్దాక్షిణ్యంగా తీసుకువెళ్తున్న రాతి బొమ్మల్లోన కొలువైన కాల శివున్ని తన నిందాస్థుతితో నిలదీసిన కంచెర్ల రామదాసు మన సాయిచంద్! నాటి ఉద్యమ సారథి కేసీఆర్ హృదయాన్ని పాట ద్వారా ఆవిష్కరించిన సాయిచంద్, సీఎం కేసీఆర్ స్వయం పాలనకు గొంతుకయ్యిండు. మనసు గల్ల కేసీఆర్ సర్కారు మళ్ల మళ్ల రావాలనే జన హృదయ ఆర్తి సాయి. పరాయి పాలనలో దగాపడ్డ రైతు బతుకులకు అందిన కేసీఆర్ రైతుబంధును, కేసీఆర్ కలల పంట కాళేశ్వరాన్ని తన గాత్రం ద్వారా ప్రజల గుండెల్లో నిలిపిన అన్నమయ్య సాయిచంద్. తన గాత్రంతో కండ్ల ముందుంచిన అరుదైన ఆశుకవి, వాగ్గేయకారుడు సాయిచంద్.
దిక్కులు పిక్కటిల్లే తెలంగాణ ఉద్యమ పాటకు ప్రతిరూపం సాయిచంద్. నింగినంటే నిప్పుల ప్రవాహం ఆయన గానం. దుందుభి తీరంలో పోటెత్తిన ఆ పాట యావత్ తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసింది. ఆటాపాటలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన కళాకారుల్లో సాయిచంద్ ప్రత్యేకం. సమైక్య పాలనలో మోడువారిన తెలంగాణ పల్లెలను.. స్వరాష్ట్రంలో స్వర్ణయుగాన్ని అనుభవిస్తున్న ఫలాలను అక్షరాల్లో ఆవిష్కరించిండు. తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని కళ్లుండి చూడలేకపోతున్న విపక్షాల దుర్నీతిని తన పాటతో ఎండగట్టిండు.
పాటంటే ప్రశ్నించే తూటానే కాదు.. ప్రవహించే ప్రగతి సెలయేరు అనే కొత్త అర్థాన్ని తెలంగాణ సమాజం ముందుంచిన గొప్ప గానకోకిల సాయి. తన గొంతులో పౌరుషాన్ని, రౌద్రాన్ని, కరుణ రసాన్ని, ఆర్ద్రతను ఒలికించే శృతి లయాత్మక గాత్రం సాయిది. ఆరు దశాబ్దాల తండ్లాట, త్యాగాల తర్వాత సాధించుకున్న తెలంగాణను నిలబెట్టుకోవాలంటే.. ఎంత కష్టం ఉన్నదో అంత కష్టాన్ని తన పాటల ద్వారా వినిపించిండు. ఒక తండ్రి తన కుటుంబాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఎదుర్కొనే కష్టాలను పంటికిందనే అదిమిపెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ హృదయాన్ని తన పాటద్వారా ఆవిష్కరించిన గొప్ప సాంస్కృతిక సాహిత్య మేధావి సాయి. తాము కలలుగన్న అభివృద్ధి తమ కండ్లముందే కదలాడుతూ, తమ అనుభవంలోకి వస్తుంటే.. మాటల్లో చెప్పలేని ప్రజా భావోద్వేగాన్ని, ఆనందాన్ని తన పాట ద్వారా తిరిగి ప్రజలకే వినిపించిన ప్రజా గాయకుడు సాయిచంద్.
ప్రజా జీవితాలను గుణాత్మకంగా మారుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను తనదైన శైలిలో కైగట్టి అద్భుతమైన తన గాత్రంతో ఆలపిస్తూ ప్రజలకు అభివృద్ధి గీతాలాపన చేసిన ప్రగతి పాటగాడు సాయిచంద్. బహుశా దేశ చరిత్రలో ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన ఒక గాయకుడు అదే స్ఫూర్తిని రగిలించే దిశగా ప్రజా పాలన గురించి పాట పాడి ప్రజల మనసులను గెలవడం గతంలో మరెన్నడూ లేదు.కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని అంతే అద్భుతంగా తన గాత్రం ద్వారా రసాత్మకంగా హృదయానికి హత్తుకునేలా పాడి వినిపించిండు మన సాయి. కాళేశ్వరం నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పడ్డ తపనను, తెలంగాణ వ్యవసాయానికి రైతాంగానికి కాళేశ్వరం ఎట్లా తోడ్పాటునందిస్తున్నదనే భావోద్వేగ కవనానికి అద్దిన ఒక అద్భుత గానం సాయిచంద్.
పాలమూరు బతుకుల గోసను తన కంఠంతో ప్రపంచానికి చాటిచెప్పిండు. కరువు నేల నుంచి వచ్చిన మట్టిబిడ్డడు గట్టిపట్టుదల, నిండైన ఆత్మవిశ్వాసంతో పైకి ఎదిగాడు. సీఎం కేసీఆర్‌తో సాయిచంద్‌కు ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. ఉద్యమకాలం నుంచి కేసీఆర్ వెంట నడిచిండు సాయి. సాయిచంద్ ప్రతిభను గుర్తించిన సీఎం కేసీఆర్ ఎంతగానో ప్రోత్సహించారు. ముఖ్యంగా ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ కోసం సాయిచంద్ ఎన్నో అద్భుతమైన పాటలు రాసిపాడాడు. సంక్షేమ ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన అవసరాన్ని ప్రజలు ఆలోచించేలా చేసింది అతడి పాట. సాయిచంద్‌ను సీఎం కేసీఆర్ సముచిత రీతిలో గౌరవించారు. 2021 డిసెంబరు 24న రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. ప్రతిభావంతుడైన సాయిచంద్‌కు మరింత సమున్నత స్థానం కల్పించాలని సీఎం కేసీఆర్ మాతో ఎప్పుడూ అంటుండేవారు.
మట్టి మనుషుల గోసకు అద్దం పట్టేది సాయిచంద్ పాట. అతడి పాట, ప్రసంగం చెట్టాపట్టాలు వేసుకొని నడిచేవి. ప్రసంగం మధ్య పాట ఎగిసేది. పాటల మధ్య ప్రసంగం ఉబికేది. తెలంగాణ రైతన్న ఆకాంక్షకు.. పండుగైన వ్యవసాయానికి పబ్బతి పట్టింది సాయి పాట. తెలంగాణ పాటల పూదోటలో నిత్యం విహరిస్తూ మనందరి మనసుల్లో చైతన్య జ్యోతులను వెలిగించిండు సాయిచంద్. సాయి పాట వినని తెలంగాణ బిడ్డ లేడు. అంతగా జన హృదయాలకు హత్తుకుంది ఆ గాత్రం. అలాంటి కాళేశ్వరం పాట నేడు మూగబోయింది. తీరని మరణ విషాదం సాయిచంద్. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడు ఒక్క గుండెను ఆపి అందరినీ ఏడిపిస్తున్నాడు. మన ఉద్యమ పేగుబంధాన్ని అకాలంగా, అకారణంగా తెంచివేసిండు. నా ఆత్మీయ మిత్రుడు, సోదరుడు సాయిచంద్ మరి లేడంటే నమ్మబుద్ధి కావట్లేదు. సాయి పార్థివదేహాన్ని నా భుజాన మోస్తుంటే, గుండె తల్లడిల్లిపోయింది. సాయిచంద్ ఆకస్మిక మరణం నాతో సహా తెలంగాణ ప్రజలందరినీ తీవ్రంగా కలచివేసింది. సాయి మరణం తెలంగాణ సమాజానికి కోలుకోలేని నష్టం. బీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి తీరని లోటు. ఇటీవల కుమ్రంభీం ఆసిఫాబాద్ బహిరంగ సభలో సాయి లేని లోటు స్పష్టంగా కనిపించింది. సభా వేదికపై సీఎం కేసీఆర్ సాయి చిత్రపటానికి నివాళులు అర్పిస్తుంటే.. ప్రతీ హృదయం మౌనంగా రోదించింది. ప్రజా గాయకుడిగా, ప్రగతి గాయకుడిగా తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా వేద సాయిచంద్ పేరు నిలిచిపోతుంది.
గులాబీ సైనికుడు సాయిచంద్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. సాయి కుటుంబాన్ని కడుపులో పట్టుకుని కాపాడుకుంటాం. సాయిచంద్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఒక కోటి యాభై లక్షల రూపాయల ఆర్థికసాయం ప్రకటించారు. సాయిచంద్ సతీమణి రజినిని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్ పర్సన్‌గా నియమించడమే కాకుండా ముఖ్యమంత్రి ఆదేశాలతో నియామక పత్రాన్ని మేమే స్వయంగా వారి స్వగృహంలో అందజేయడం జరిగినది. పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తను ముఖ్యమంత్రి కేసీఆర్ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారనడానికి ఇదే తాజా ఉదాహరణ. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
మిత్రమా నీ మరణం మా నుంచి మిమ్మల్ని భౌతికంగా దూరం చేసినా.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మీ పాట అజరామరం. నీ గొంతు మా గుండెల్లో పదిలం. ఉద్యమ గాయకుడా.. యావత్ తెలంగాణ నీకు సమర్పిస్తోంది ఉద్యమ జోహార్లు.. కన్నీటి నివాళులు…!!
(వ్యాసకర్త: ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు)
–బాల్క సుమన్
94938 66666