హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : మిజోరం శాసనసభ స్పీకర్ లాల్బియాక్జామా దంపతులు మంగళవారం అసెంబ్లీని సందర్శించారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన లాల్బియాక్జామా, ఆయన సతీమణి వాన్లాల్రువతిని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరురాష్ర్టాల స్పీకర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, పనితీరు, పద్ధతులపై వారు చర్చించారు. అనంతరం తెలంగాణ శాసనసభ తరఫున మిజోరాం స్పీకర్ దంపతులను శాలువాతో సతరించి జ్ఞాపికను బహూకరించారు.
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని కిన్నెరసాని, శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతాలు, అమ్రాబాద్, గోదావరి నది తీర ప్రాంతంలో ఉన్న కవ్వాల్ టైగర్ రిజర్వ్, ఆదిలాబాద్, ములుగు ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఎకో టూరిజం అభివృద్ధి, పులుల సంరక్షణ, టైగర్ రిజర్వ్‌ల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై నిర్వహించిన సమావేశంలో సీఎస్ మాట్లాడారు. కేంద్ర నిధులను వినియోగించుకొని ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీసు శాఖను మరింత సమర్థంగా తీర్చిదిద్దుదామని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మంగళవారం పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. పోలీసు విభాగంలో తీసుకురావాల్సిన సంస్కరణలు, సిబ్బంది వినియోగం తదితరాలపై చర్చించారు. అనంతరం సీవీ ఆనంద్ మాట్లాడుతూ సమావేశంలో అధికారులు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డీజీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో బోరుబావుల కింద వరి వేయకుండా.. కూరగాయలు సాగుచేయడమే శ్రేయస్కరమని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి తెలిపారు. ఎల్ నినో నేపథ్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన సెమినార్లో ఆయన మాట్లాడారు. బోరుబావుల కింద ప్రస్తుతం ఆముదం, కందులు సాగు చేసుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. రైతులకు ఇన్సెంటివ్స్ ఇచ్చి, కూరగాయల సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరారు.