హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం ఏర్పాటైంది. మంగళవారం తెలంగాణ సారస్వత పరిషత్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ ముఖ్యఅతిథిగా హాజరై సంఘం లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంఘం సామాన్య అర్చకుడికి తోడుగా నిలువాలని, ధూపదీప అర్చకులు దోపిడీకి గురికాకుండా చూడాలని సూచించారు.
నూతన సంఘం తరపున సంతోష్‌శాస్త్రి, ఓరుగంటి మాధవాచారి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని దేవాలయాల్లో సమయపాలన విధించాలని ఆలోచన చేస్తున్న దేవాదాయశాఖ అధికారులు ముందుగా అర్చకుల సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి అర్చకుల సమస్యలు విన్నవిస్తామని తెలిపారు. అన్నావఝ్జల ప్రసాదశర్మ మాట్లాడుతూ.. మంత్రి కొండా సురేఖ, ఇతర మంత్రులకు వినతిపత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. అనంతరం ధూప దీప నైవేద్య అర్చకులను దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకుని ఉద్యోగభద్రత కల్పిస్తూ 99పీఆర్సీ వర్తింపజేయాలని తీర్మానించారు.