Smugglers tricks | మిజోరంలో పశువుల అక్రమ రవాణా కేసు ఒకటి తెరపైకి వచ్చింది. విదేశాలకు చెందిన జంతువులు, పక్షులను స్మగ్లర్ల బారి నుంచి పోలీసులు రక్షించారు. వీరి నుంచి 140 జంతువులు, పక్షులతోపాటు 30 తాబేళ్లు, 22 కొండచిలువలు, 55 మొసళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధమున్న ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి మూడు వాహనాలను పోలీసులు స్వాధీన పర్చుకున్నారు. పొరుగు దేశమైన మయన్మార్ నుంచి విదేశీ జంతువులను స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు, మిజోరాం పోలీసులు చంఫై మీదుగా రవాణా చేస్తుండగా రూ.34 కోట్ల విలువైన 6.83 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మిజోరాంలోని చంఫై పోలీసులు, ఎక్సైజ్ బృందం, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. 2 బొలెరోలు, 1 స్కార్పియోలో బోనుల్లో బంధించిన అనేక జంతువులు కనిపించాయి. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని విచారించగా.. ఈ జంతువులను పొరుగు దేశమైన మయన్మార్ నుంచి తీసుకొచ్చినట్లు బయటపడింది. జంతువులను కస్టమ్స్ ప్రివెంటివ్ ఫోర్స్ (సీపీఎఫ్)కి అప్పగించారు. సెప్టెంబర్‌లో అసోంలో 40 విదేశీ జంతువులను రక్షించారు. వీటిని కూడా మయన్మార్ నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. అలాగే, అక్టోబర్ 8న ముంబైలో డీఆర్ఐ బృందం ఒక ప్రాంతంలో దాడులు జరిపి 665 విదేశీ జంతువులను స్వాధీనం చేసుకున్నది. వాటిలో కొండచిలువలు, బల్లులు, తాబేళ్లు, ఇగువానాలు ఉన్నాయి. ఈ కేసులో ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు.
ఇదే చెక్‌పోస్ట్ వద్ద జరిపిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో మత్తు మందు దొరికింది. ఒక వాహనంలో తరలిస్తున్న 6.83 కిలోల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.34.18 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.