మద్దూర్, జనవరి 23 : మద్దూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో గత ఏడు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని రెణివట్ల, చెన్నారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళలు వాపోతున్నారు. అయితే రెణివట్ల గ్రామాన్ని ఇటీవల మద్దూరు మున్సిపాలిటీలో విలీనం చేయడంతో గ్రామస్తులు తమ సమస్యలను ఎవరు చెప్పుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు మాత్రం మూడు రోజులు పైప్లైన్ మరమ్మతులు ఉన్నాయని నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించి మూడు రోజులు గడిచి వారం రోజులు అవుతున్నా నీటి సరఫరాపై నోరుమెదపడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారానైనా నీటిని సరఫరా చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులైనా స్పందించి మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరించి తాగునీటి ఇబ్బందులు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.