ప్యాంగ్యాంగ్: పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచమంతటా ఉద్రిక్తతలు నెలకొన్న వేళ అమెరికా లక్ష్యంగా ఉత్తర కొరియా శక్తివంతమైన క్షిపణి ఇంజిన్ను పరీక్షించింది. ఈ మేరకు ఆ క్షిపణి ప్రయోగ తేదీని వెల్లడించకుండా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అత్యాధునిక కర్బన మిశ్రమ పదార్థాలతో నిర్మించిన ఇంజిన్ను ఈ పరీక్షలో ఉపయోగించారని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 2,500 కిలో టన్నుల పీడనంతో పని చేయగలిగిందని.. ఇది మునుపటి సామర్థ్యం కంటే ఎక్కువని.. ఇలాంటి మెరుగైన మిసైళ్లు పలు వార్ హెడ్లను అమర్చేందుకు అనుకూలంగా ఉంటాయని రక్షణ రంగ విశ్లేషకులు తెలిపారు. వీటి ద్వారా క్షిపణి రక్షణ వ్యవస్థలను ఛేదించే అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.