హైదరాబాద్, జనవరి 2 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో బిల్లులు నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని ఆర్థికశాఖ ఖండించింది. ‘ధనిక రాష్ట్రంలో బిల్లుల గోస’ అనే పేరుతో వచ్చిన వార్త పూర్తిగా నిరాధారమైనదని, అవాస్తవమని పేర్కొంటూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నెలకు రూ.14 వేల కోట్ల నుంచి రూ.16 వేల కోట్లు విడుదల చేస్తున్నామని, రూ.14 వేల కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయని ఆంధ్రజ్యోతిలో ప్రచురించడం సత్య దూరం, ఆక్షేపణీయమని పేర్కొన్నారు. కరోనా కారణంగా రెండేండ్లుగా ఆర్థికంగా ఒడిదుడుకులున్నా.. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా క్రమం తప్పకుండా వివిధ పథకాలకు నిధులను విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం బిల్లుల చెల్లింపులకే సుమారు రూ.20,787 కోట్లు విడుదల చేసినట్టు పేర్కొన్నారు.
2014 నుంచి 2021 నవంబర్ వరకు మూలధన వ్యయంలో దేశంలోనే ఇతర రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఏడేండ్లలో బడ్జెట్ నుంచి రూ.1.63 లక్షల కోట్లు, బడ్జెటేతర పద్దు నుంచి రూ.1.06 లక్షల కోట్లు మొత్తంగా రూ.2.70 లక్షల కోట్లను ఖర్చు చేసినట్టు వివరించారు. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ర్టాన్ని ఏమాత్రం సరితూగని ఒడిశాతో పోల్చడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్ అండ్ బీ శాఖ చెల్లింపులే ఏటా రూ.4 వేల కోట్లకుపైగా ఉంటాయని చెప్పారు. ఆంధ్రజ్యోతి పత్రిక కనీసం తమను సంప్రదించకుండా తప్పుడు కథనాలు ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండించారు.