నిజామాబాద్ : ప్రధాని పసుపు బోర్డు ప్రకటన కేవలం ఎన్నికల్లో లబ్ది కోసమే చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి. మీకు నిజంగా రైతుల మీద ప్రేమ, చిత్తశుద్ది ఉండి ఉంటే మొన్నటి ప్రత్యేక సమావేశాల్లో ఎందుకు పసుపు బోర్డు కోసం బిల్లు పెట్టలేదని కేంద్రాన్ని రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలంలో సుమారు 21 కోట్ల నిధులతో పలు అభివృద్ది పనులకు సోమవారం శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేసిన బీజేపీ మళ్లీ పసుపు బోర్డు అని రైతులకు మోసపు మాటలు చెప్పడం దుర్మార్గమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు పేరుతో రైతులను ఇంకా ఎన్ని సార్లు మోసం చేయాలని చూస్తారని మండిపడ్డారు. 1986 పార్లమెంట్ ద్వారా చట్టమైన స్పైస్ బోర్డులో భాగంగా ఉన్న పసుపుకు బోర్డు ఏర్పాటు చేయాలంటే ప్రత్యేక చట్టం చేయాలని ప్రధాని మోదీకి తెల్వదా అని నిలదీశారు.
ఎద్దు ఎవుసం తెల్వని కాంగ్రెస్ ను, రైతును మోసం చేసే బీజేపీ ని నమ్మితే అరిగోసలు తప్పవని..తస్మాత్ జాగ్రత్త అన్నారు. ఒకడేమో(బీజేపీ) మోటార్లకు మీటర్లు పెడతామని తిరుగుతున్నడు, ఒకడేమో(కాంగ్రెస్) గంటలో ఎకరం పరిస్తాం రైతులకు మూడు గంటల కరెంట్ చాలు అని మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు.
ఇప్పుడు మోసపు హామీలతో వస్తున్న వారి చేతిలో గతంలో అందరం అరిగోస పడ్డవాల్లమే అది గుర్తు చేసుకోవాలని అన్నారు.
సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలోనీ ప్రతి పల్లెలో కోట్ల రూపాయల అభివృద్ది చేశామని తెలిపారు. అన్ని రకాల సంక్షేమ పథకాలతో పల్లెలు అభివృద్ది పథంలో దూసుకెళ్తున్నయని అన్నారు. మంత్రి వెంట రైతు నాయకుడు కోటపాటి నర్సింహ నాయుడు, డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.