హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసబ్ ట్యాంక్‌లోని మత్స్య శాఖ కమిషనర్ కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం కలిసి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చేప పిల్లల పంపిణీని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన మత్స్య మిత్ర యాప్‌ను మంత్రి ప్రారంభించారు.
చేప పిల్లలను సరఫరా చేసే వాహనం నంబర్, డ్రైవర్ వివరాలు, ఫోన్ నంబర్ తదితర వివరాలను యాప్‌లో నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. చేప పిల్లలను ఎక్కడ ఎంత పోశారు? చేప రకం ? ఫొటోలతో పాటు తదితర వివరాలు ఏ రోజుకారోజు యాప్‌లో నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ యాప్‌తో కలిగే ఉపయోగాలను మత్స్యకారులకు అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. చేపపిల్లల విడుదల ప్రక్రియను పర్యవేక్షించేందుకు కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని 5వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని ఘన్పూర్ రిజర్వాయర్‌లో మంత్రి తలసాని చేపపిల్లలను వదిలి, కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.
ఈ ఏడాది 26,778 నీటి వనరుల్లో రూ.68కోట్ల వ్యయంతో 88.53 కోట్ల చేప పిల్లలను విడుదల చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 5న ప్రారంభమయ్యే ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని మంత్రి ఆదేశించారు. సంబంధిత మత్స్య సొసైటీల సభ్యులను సైతం ఆహ్వానించాలని సూచించారు. మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యక్రమం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఎక్కడా ఎలాంటి విమర్శలకు తావులేకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్రంలోని చెరువుల్లో నీటి నిల్వలను పర్యవేక్షించేందుకు 26వేలకుపైగా నీటి వనరులను జియోట్యాగింగ్ చేసినట్లు మంత్రి వివరించారు.