హన్వాడ, అక్టోబర్ 3 : యువకులు క్రీడల్లో రాణించాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ స్పోర్ట్స్ కిట్ పంపిణీకి సీఎస్ శాంతికుమారితో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శ్రీకారం చుట్టారు. ముందుగా క్రీడాకారులకు క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేశామన్నారు.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 వేల గ్రామాల్లో కేసీఆర్ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల క్రీడా మైదానాలను పూర్తి చేశామని చెప్పారు. ఉదయం, సాయంత్రం మైదానాల్లో క్రీడలు ఆడాలన్నారు. క్రీడాకారుల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నదన్నారు. దేశంలోనే అతి పెద్ద పార్కును మహబూబ్‌నగర్‌లో కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు పేరిట ఏర్పాటు చేసుకున్నామన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో తాగు, సాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదని తెలిపారు. అనంతరం సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ క్రీడలకు సర్కారు సముచిత స్థానం కల్పిస్తున్నదన్నారు. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృషి అభినందనీయమన్నారు. రోడ్డుకిరువైపులా హరితహారం ఫరిడవిల్లుతున్నదని ప్రశంసించారు.
అనంతరం వాలీబాల్, కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శాట్ చైర్మన్ ఆంజనేయగౌడ్, క్రీడా శాఖ డైరెక్టర్ కే.లక్ష్మి, కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నరసింహ, ఎంపీపీ బాలరాజు, డీఆర్డీఏ పీడీ యాదయ్య, జెడ్పీటీసీ విజయనిర్మల, ఎంపీడీవో ధనుంజయగౌడ్ తదితరులు పాల్గొన్నారు.