హైదరాబాద్, జనవరి 3 (నమస్తేతెలంగాణ) : తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీని ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. ఎక్కడ, ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలనే విషయంపై సంబంధిత వర్గాలు, నిపుణులతో సంప్రదింపులు ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో సెంటిలియన్ నెట్వర్క్స్ అండ్ హెచ్‌సీ రోబోటిక్స్ కొత్త క్యాంపస్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీలో నిర్మించనున్న ఏఐ యూనివర్సిటీకి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని, ప్రత్యేకంగా క్వాంటం కంప్యూటింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను కూడా ప్రారంభిస్తామని వివరించారు.