ఏటూరు నాగారం : ఏటూరు నాగారంలో బస్సు డిపో పనులకు గురువారం పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఏటూరునాగారంలో బస్సు డిపో ఏర్పాటు చేయాలనే చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. ఇక్కడ బస్సు డిపో నిర్మాణం కోసం రూ.7 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ములుగు, మంగపేటలో బస్టాండ్ నిర్మాణం చేపట్టడంతో పాటు గట్టమ్మ వద్ద కూడా బస్టాండ్ నిర్మిస్తామని తెలిపారు. బస్సు డిపో నిర్మాణ పనులు త్వరగా నాణ్యతతో పూర్తి చేయాలని ఆర్టీసీ అధికారులను సీతక్క ఆదేశించారు.
వచ్చే మేడారం జాతర నాటికి బస్సు డిపో పనులు పూర్తి చేసి రవాణా శాఖ మంత్రిచే ప్రారంభించాలని సూచించారు. జాతరకు బస్సులు నడపాలని సూచించారు. ములుగు కంటే ఏటూరునాగారంలోని బస్సు డిపో ఏర్పాటు చేస్తే మారుమూల ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని సూచించారు. జాతర వచ్చే ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో మేడారం చేరుకుని దర్శనం చేసుకోవాలని కోరారు.
ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ ..
నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు 5000 మంజూరు చేశారని, నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు అయినప్పటికీ ఐటీడీఏను దృష్టిలో పెట్టుకుని మరొక 1500 అదనంగా మంజూరు చేసినట్లు తెలిపారు. మూడు విడుతలుగా ఇండ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు దుస్తులు పంపిణీ చేశారు.
కార్యక్రమాల్లో ఐటిడిఎ పీఓ చిత్రా మిశ్రా, ఏఎస్పీ శివ ఉపాధ్యాయ, అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి, డి ఆర్ డి ఓ సంపత్ రావు, గ్రంథాలయ చైర్మన్ బానోతు రవి చందర్, ఆర్టీసీ ఆర్ఎం విజయభాను, డిప్యూటీఆర్ ఎం కిరణ్, చీఫ్ ఇంజినీర్ భాస్కర్,ఐటిడిఏ ఏపీవో వసంతరావు, ఎంపీడీవో రాజ్యలక్ష్మి, స్థానిక నాయకులు ఇర్సవడ్ల వెంకన్న, చిటమట రఘు, వసంత, శ్రీనివాస్, గుడ్ల దేవేందర్, వావిలాల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.