హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): అనాథ పిల్లలకు సేవ చేసే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఆదివారం తన పుట్టినరోజు వేడుకను మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని శిశువిహార్‌లో పిల్లలతో కలిసి జరుపుకొన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ పిలుపుమేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా శిశువిహార్ పిల్లలతో కలిసి మూడు మొక్కలు నాటారు. మంత్రి సత్యవతి రాథోడ్‌కు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ పాల్గొన్నారు.