హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లు, కార్మికుల సంక్షేమం, సమస్యల పరిషారమే లక్ష్యంగా ఈ నెల 7న సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆటో కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ప్రతినిధులతో రవాణా, కార్మికశాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి చర్చించనున్నారు.
గత నెల 23న ఆటో యూనియన్ల జేఏసీ ప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి ఆటో డ్రైవర్ల సంక్షేమానికి సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖల సమన్వయంతో సమస్యలకు సాధ్యమైనంత త్వరగా పరిషారం చూపేందుకు ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.