చిరుజల్లులు కురిసినా… హరివిల్లులు విరిసినా… మది మురుస్తుందేమో కానీ, పాదాలు మాత్రం పనుల కోసం పరిగెడుతూనే ఉంటాయి. వానాకాలాన్ని ఓ వైపు అనుభవిస్తూనే వాటి బాగోగులు చూసుకోవడం మన బాధ్యత. ఈ జల్లుల వేళలో జెల్లీ పాదరక్షలు మనకు తోడుగా ఉంటాయి. ఓ వైపు అందంగా కనిపిస్తూనే పాదాలను పదిలంగా ఉంచుకునేందుకు సహకరిస్తాయి.
వర్షం పడితే వేడి వేడి బజ్జీలు… ఆవిర్లూరే కాఫీలు తాగడం హాయిగానే ఉంటుంది. కానీ, కాలు బయటపెట్టాలంటే కాసింత కష్టంగా తోస్తుంది. చెప్పుల నిండా బురద… కడిగినా తడిపొడిగానే వాడకం… ఇవన్నీ ఇబ్బంది పెట్టే విషయాలే. మరి దీనికి మంచి మందేం లేదా అంటే, బ్రహ్మాండంగా ఉందని చెబుతాయి జెల్లీ చెప్పులు. రబ్బరుతో తయారై పారదర్శకంగా ఉండే ఇవి వానల్లో పాదాలకు మంచి నేస్తాలు.
ఎన్నో వెరైటీలు..
చర్మాన్ని ఇబ్బంది పెట్టని పీవీసీ, ప్రత్యేకమైన రబ్బరుతో వీటిని తయారు చేస్తారు. దాని వల్ల ఎంత వానలో వెళ్లినా ఇవి నీటిని పీల్చుకోవు. మట్టి కూడా ఎక్కువగా పట్టదు. నీటితో శుభ్రం చేశాక చిటికెలో ఆరిపోతాయి. దీని వల్ల పాదాలను ఇన్ఫెక్షన్ల బారి నుంచి తప్పించవచ్చు. ఉపయోగకరమైనవే కాదు.. ఫ్యాషనబుల్ కూడా! ఇందులో తెల్లగా గాజులా ఉండే మోడళ్లు తొలి నుంచీ ఉన్నా… ఏ యేటికాయేడు కొత్త కొత్త వెరైటీలు తోడవుతూనే ఉన్నాయి. వలలాగా కనిపించే ఫిషర్మెన్ అండ్ కేజ్డ్ జెల్లీస్, ఫ్యాషనబుల్ హీల్స్ తరహాలో ఉండే జెల్లీ మ్యూల్స్- నిట్టెడ్ హీల్స్, స్పోర్ట్స్ షూల మాదిరి ఉండే స్పోర్టీ జెల్లీ హైబ్రిడ్స్… ఇలా ఎన్నో రకాలు దొరుకుతున్నాయి. డెనిమ్, నార్మల్ ట్రౌజర్స్, కింది భాగంలో వెడల్పుగా ఉండే వైడ్లెగ్ ప్యాంట్లలాంటి వాటి మీదకి, స్కర్టులు, డ్రెస్సుల మీదకీ చక్కగా నప్పుతాయి. అమ్మాయిలతోపాటు అబ్బాయిలకూ తగినన్ని వెరైటీలు దొరుకుతున్నాయి. కాబట్టి ఇక ఈ జెల్లీలు ఉంటే జల్లుల గురించి చింత లేనట్టే!