సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలను హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. మరో వర్షం పడితే హిమాయత్ సాగర్ జలాశయం పూర్తిగా నిండిపోతుందని చెప్పారు.
జలాశయం నిండితే దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. మరో 5వేల క్యూసెక్కుల నీళ్లు వస్తే 10 గంటల్లో జలాశయం నిండి ఓవర్ ఫ్లో అవుతుందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం హెడ్‌క్వార్టర్స్ వదిలపెట్టకుండా నిరంతరం విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో అవసరం ఉంటే తప్ప ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. మంత్రి వెంట రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, బండ్లగూడ మేయర్ లతా ప్రేమ్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లకు వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాలైన శంకర్పల్లి, నవాబ్‌పేట, ఖానాపూర్, వికారాబాద్, పరిగి, చేవెళ్ల, మొయినాబాద్ తదితర ప్రాంతాల్లో మంగళవారం వర్షం ప్రభావం తగ్గడంతో జలాశయాల్లోకి వరద నీరు గణనీయంగా తగ్గింది. ఉస్మాన్‌సాగర్‌కు 800, హిమాయత్‌సాగర్‌కు 400 క్యూసెక్కుల నీరు చేరుతుంది. అయితే ఉస్మాన్‌సాగర్ గరిష్ఠ స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా..1785.55 అడుగుల మేర నీటి నిల్వలు ఉన్నాయి.
హిమాయత్ సాగర్ గరిష్ఠ స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా.. 1759.80 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. దాదాపు మూడున్నర అడుగుల మేర వరద నీరు వచ్చి చేరితే జంట జలాశయాల గేట్లు ఎత్తి దిగువన ఉన్న మూసీలోకి వదిలేందుకు జలమండలి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా జంట జలాశయాలను చూసేందుకు సందర్శకులు భారీగా వస్తున్నారు.