Union Budget | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్ ఉసూరుమనిపించింది. ఎన్నికలు జరిగే రాష్ర్టాలకు వరాలు, ప్రత్యక్ష పన్నులపై కొంత మినహాయింపులు తప్పించి బడ్జెట్లో చెప్పుకోదగ్గ అంశాలు కనిపించలేదు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు చర్యలు లేవు. వృద్ధికి ఊతమిచ్చే నిర్ణయాలేమీ ప్రకటించలేదు. రూ.12 లక్షల వార్షిక ఆదాయం వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చి వేతనజీవికి కొంత ఊరట కలిగించినా, దేశంలో ప్ర తి పౌరుడిపై పడే పరోక్ష పన్నుల మోతను మాత్రం తగ్గించే ప్రయత్నం జరగలేదు. మందగమనంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టే ప్రయత్నాలు బడ్జెట్లో కనిపించడం లేద నే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌ను రూపొందించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ద్రవ్యోల్బణం కట్టడికి లేని చర్యలు
దేశంలో విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం ఇప్పుడు ప్రధాన సమస్య. ద్రవ్యోల్బణంతో దేశ ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న ముప్పు అంతా ఇంతా కాదని నిపుణులు చెప్తున్నారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉం టేనే వృద్ధికి ఆస్కారం ఉంటుందని, కొనుగోలుదారుల వినిమయ శక్తి పుంజుకోగలదని గుర్తుచేస్తున్నారు. కేవలం అధిక ధరల కారణంగానే రెండేండ్లుగా రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల కోతకు దూరంగా ఉందని, అలాంటిది బడ్జెట్లో ధరల కట్టడికి తీసుకున్న చర్యలు శూన్యమని పెదవి విరుస్తున్నారు. అప్పుడు ద్రవ్యోల్బణం కూడా దిగివస్తుందని చెప్తున్నారు.
కొనసాగిన సుంకాల మోత
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), కస్టమ్స్-ఎక్సైజ్ సుంకాలను తగ్గించాల్సిన అవసరం ఉన్నదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నా బడ్జెట్లో ఈ మేరకు నిర్ణయాలు లేవు. సుంకాల ప్రభావం ప్రజల జీవన వ్యయాలు, పొదుపు-పెట్టుబడులపై పెద్దఎత్తున ఉంటుంది. పెట్రోల్, డీజిల్ నుంచి స్టీల్, సిమెంట్ వరకు అన్నింటిపైనా జీఎస్టీని బాదేస్తున్నారని, విదేశాల నుంచి భారత్‌లోకి వస్తున్నవాటిపై కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడుతున్నారు.
వేతన జీవికి కొంత ఊరట
12 లక్షల వరకు వార్షిక ఆదాయం పొందేవారికి ఆదాయ పన్ను నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చిది. ఈ నిర్ణయంతో కోటి మంది ప్రజలు పన్ను కట్టాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రస్తు తం ఉన్న ఆదాయ పన్ను శ్లాబ్‌లను మారుస్తున్నట్టు చెప్పారు. దీంతో 80 శాతానికి పైగా పన్ను చెల్లింపుదారులు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. బడ్జెట్లో టీడీఎస్, టీసీఎస్ మినహాయింపు పరిమితులను పెంచారు. సీనియర్ సిటిజన్లకు వార్షిక వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పరిమితిని లక్షకు పెంచుతున్నట్టు నిర్మల ప్రకటించారు. ఇంతకుముందు ఇది రూ.50 వేలుగానే ఉన్నది.
మేలు జరిగేది ఎంత మందికి?
ఆదాయ పన్నుపై బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాలతో లబ్ధి కలిగేది చాలా తక్కువ మందికే. దేశంలో ఏటా ఆదాయ పన్ను రిటర్నును దాఖలు చేసేవారు 6 శాతాన్ని మించడం లేదు. వీరిలో నిల్ శ్లాబ్‌లో ఉన్నవారి సంఖ్యే 70 శాతానికిపైగా ఉంటున్నది. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం ఎందరికి లాభమని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
సభ నుంచి విపక్షాల వాకౌట్
బడ్జెట్ ప్రసంగం వేళ శనివారం లోక్‌సభలో విపక్షాలు నిరసనగా దిగాయి. కొద్ది సేపు సభ నుంచి వాకౌట్ చేశాయి.
బీహార్‌కు వరాలు..
జేడీయూ అధినేత నితీశ్‌కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబును మురిపించడానికి ప్రధాని మోదీ తీవ్రంగా శ్రమించారు. మిత్రపక్షాలను కాపాడుకోవాలనే తాపత్రయం బడ్జెట్లో అడుగడుగునా ప్రతిబింబించింది. బీహార్, ఏపీకి బడ్జెట్లో అగ్రతాంబూ లం ఇవ్వడమే ఇందుకు రుజువు. బడ్జెట్లో బీహార్‌కు దక్కినంత ప్రాధా న్యం మరే రాష్ర్టానికి దక్కలేదు. విపక్షాలు పాలిస్తున్న రాష్ర్టాలకు మాత్రం కేంద్రం ఎప్పటిలాగే మొండిచేయి చూపించింది. తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల పేర్లు కూడా బడ్జెట్ ప్రసంగంలో వినపడకపోవడం గమనార్హం.
డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం 47 వేల కోట్లు!
ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా వదిలించుకోవాలని చూస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ వచ్చే ఏడాది కూడా భారీ స్థాయిలో వాటాలను విక్రయించడానికి సిద్ధమవుతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో పీఎస్యూలో వాటాల విక్రయం ద్వారా రూ.47 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. వ్యవసాయాన్ని, తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు పలు పథకాలు ప్రకటించింది. రైతులకు సంబంధించిన కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది. కోటి మంది గిగ్ వర్కర్లకు గుర్తింపు, బీమాను కల్పించనుంది. ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేసింది. ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడులపై పరిమితిని తొలగించింది. అణు విద్యుత్తు రంగంలో ప్రైవేటు రంగ పెట్టుబడులకు పచ్చజెంండా ఊపింది. ఇక, మూలధన వ్యయాన్ని కేంద్రం స్వల్పంగా పెంచింది.
వరుసగా 8వసారి నిర్మల ‘పద్దు’
ఆర్థిక వ్యవస్థ మంద గమనం, పన్నుల్లో కోత విధించాలని మధ్య తరగతి డిమాండ్ చేస్తున్న వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం వరుసగా 8వసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీంతో పదిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డుకు ఆమె చేరువగా వచ్చారు. నిర్మల దేశానికి తొలి పూర్తికాల ఆర్థిక మంత్రిగా గుర్తింపు పొందారు. 2019లో ఆమె మోదీ రెండోసారి అధికారంలో వచ్చినప్పుడు ఆర్థిక మంత్రి అయ్యారు. సుదీర్ఘ సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు ఆమె పేరిటే ఉంది. 2020లో ఆమె 2.40 గంటల పాటు పద్దును చదివారు.
గురజాడ మాట.. బడ్జెట్‌కు బాట
ప్రముఖ తెలుగు కవి గురజాడ అప్పారావు చెప్పిన ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ సూక్తితో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం కేంద్ర బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని చెప్పారు. తెలుగింటి కోడలైన నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని తెలుగు కవి సూక్తితో ప్రారంభించడం విశేషం. గురజాడ అప్పారావు స్వాతంత్య్రానికి పూర్వం బాల్య వివాహాలకు, కన్యాశుల్కానికి వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన సంఘ సంస్కర్తగా కీర్తి పొందారు.
మొత్తం బడ్జెట్ 50,65,345 కోట్లు