మేడ్చల్ : ఉద్యోగులు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా విధులు నిర్వహించాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy) అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో ‘ గ్రామ రెవెన్యూ సహాయకులు-నేటీ ప్రభుత్వ ఉద్యోగులు’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 131 మంది వీఆర్ఏలకు మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)పెద్దమనస్సుతో వీఆర్ఏలను ప్రభుత్వంలో విలీనం చేయడం అభినందనీయమని అన్నారు. ప్రజలు, ఉద్యోగుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి పరితపిస్తుంటారన్నారు.
ప్రభుత్వంలో విలీనం తరువాత ప్రభుత్వ ఉద్యోగాలకు సమానంగా వేతనం, ఇతర సౌకర్యాలు, వసతులు అందుతాయని వివరించారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడ ఇలాంటి గొప్ప నిర్ణయాలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఇటీవలఆర్టీసీ (RTC) కార్మికులను ప్రభుత్వంలో కలిపారని గుర్తు చేశారు.
కలెక్టర్ అమోయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్వర్వుల మేరకు విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖాల్లో భర్తీ చేశామని అన్నారు. జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, హెల్పర్లుగా నియమిస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేసిందన్నారు. జిల్లాలో ప్రసుత్తం 131 మంది గ్రామ రెవెన్యూ సహాయకులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేసామని, అందులో 72 మందికి రెవెన్యూశాఖ, ఎంఏయూడికిశాఖకు 6, ఇరిగేషన్‌శాఖకు 22, మిషన్ భగీరథలో 30, స్టెట్ టాక్సెస్శాఖకు ఒకరిని కేటాయించామని వెల్లడించారు.