
జవహర్‌నగర్, నవంబర్ 17: దయనీయ ఘటనలు చోటుచేసుకున్నప్పుడు వేగంగా స్పందించే మనస్తత్వమున్న మంత్రి కేటీఆర్ బుధవారం రాత్రి జరిగిన ఓ ప్రమాదానికి తీవ్రంగా చలించిపోయి తానే స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తన మానవతా హృదయాన్ని మరోమారు చాటుకున్నారు. మియాపూర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు హకీంపేట వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఇంతలో అటువైపు నుంచి వస్తున్న మంత్రి కేటీఆర్ తన కాన్వాయ్‌ను ఆపారు. వాహనం దిగి ఆలస్యం చేయకుండా క్షతగాత్రులను హుటాహుటిన తన కాన్వాయ్ వాహనంలో సమీప ఆస్పత్రికి తరలించారు. వారికి మెరుగైన ఆరోగ్య సేవలందేలా తన సిబ్బందిని అప్రమత్తం చేశారు.