హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): టెక్స్టైల్ రంగంపై పెంచిన జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించాలని సొంతపార్టీ నేతలే బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కనీసం గుజరాత్ బీజేపీ నేతలు చేసిన ఈ విజ్ఞప్తినైనా వినాలంటూ మంత్రి కేటీఆర్ కేంద్రానికి హితవు పలికారు. బుధవారం సూరత్‌లో టెక్స్టైల్ వ్యాపారులతో ‘ప్రీ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్-వీవింగ్ గ్రోత్ ఫర్ టెక్స్టైల్’ నిర్వహించారు. ఈ సందర్భంగా గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ మాట్లాడుతూ.. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా జీఎస్టీ తగ్గించాలని కేంద్రానికి లేఖ రాయనున్నారని చెప్పారు. దీనిపై సానుకూల నిర్ణయం వస్తుందని అదే సమావేశం లో పాల్గొన్న కేంద్ర టెక్స్టైల్ శాఖ సహాయమంత్రి దర్శన జర్దోశ్ పేర్కొనడం విశేషం.మరోవైపు సూరత్‌లో గురువారం 70 వేల మంది వస్త్రవ్యాపారులతో కూడిన అసోసియేషన్ బంద్‌కు పిలుపునిచ్చింది.
గోయల్జీ గుజరాత్ గొంతైనా వినండి
చేనేత, వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపును నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాయడంతోపాటు పీయూష్‌గోయల్‌కు ట్వీట్ కూడాచేశారు. ‘కేంద్ర జౌళిశాఖ సహాయ మంత్రి దర్శన జర్దోష్ జీ, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ కూడా జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించాలని డిమాండ్చేస్తున్నారు. హమారీ నహీ తో సహీ, గుజరాత్ కీ ఆవాజ్ తో సునియే పీయూష్ గోయల్ జీ.. టెక్స్టైల్స్ పై జీఎస్టీ తగ్గించాలని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధినేత కోరుతున్నారు’అని ఇందుకు సంబంధించిన వార్తను మంత్రి కేటీఆర్ కేంద్ర టెక్స్‌టైల్‌శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ట్వీట్‌చేశారు. టెక్స్టైల్ రంగంపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని మంత్రి కేటీఆర్ నిర్మలాసీతారామన్‌కు ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
జీఎస్టీని తగ్గించాలని డిమాండ్
చేనేతపై పెంచిన జీఎస్టీని తగ్గించాలని తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమ్మనబ్రోలు ప్రకాశ్ డిమాండ్ చేశారు. గురువారం సికింద్రాబాద్ ప్యారడైజ్‌లోని రాజ్ కంఫర్ట్ హోటల్లో నిర్వహించిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీఎస్టీ పెంపుతో వస్త్ర వాణిజ్యం కుప్పకూలే ప్రమాదం ఉన్నదన్నారు.