
‘ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసి చూడు..అని పెద్దలు ఉత్తగనే అనలేదు. ఈ రెండూ ఎంతో కష్టంతో కూడుకున్నవి. కానీ ఇల్లు కట్టిస్తా..పెండ్లి కూడా నేనే చేస్తా.. అని చెప్పిన ఏకైక సీఎం కేసీఆరే. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మాత్రమే పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నది. ప్రభుత్వం కట్టించి ఇస్తున్న ఒక్కో ఫ్లాట్ విలువ రూ.40 లక్షల వరకు ఉంటుంది. ఆడపడుచుల పెండ్లి కోసం లక్షా 116 రూపాయల ఆర్థిక సాయం కూడా ప్రభుత్వమే అందిస్తున్నది. దేశంలోని మిగతా 28 రాష్ర్టాల్లో ఎక్కడా ఈ కార్యక్రమం అమలు కావడం లేదు. కొంతమంది దళారులు ఇండ్లు ఇప్పిస్తామంటూ మీకు మాయమాటలు
చెబుతారు. వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దు.
లాటరీ పద్ధతిలోనే బస్తీవాసులకు ఇండ్లు కేటాయిస్తాం. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 18వేల కోట్ల రూపాయలను కేటాయించగా ఇప్పటికే 11వేల కోట్లు ఖర్చు చేశాం. మిగిలిన ఇండ్ల నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తాం’ అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట
డివిజన్‌కు చెందిన చాచానెహ్రూ నగర్లో రూ.20.64కోట్లతో నిర్మించిన 264 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి లతో కలిసి మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన పత్రాలను అందజేశారు.
పేదలకు గూడు.. ఆడబిడ్డల పెండ్లికి చేయూతను అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం లో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతున్నదని పేర్కొన్నారు. శుక్రవారం సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్‌పేట డివిజన్ సీసీనగర్లో రూ.20.64 కోట్లతో నిర్మించిన 264 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవిలతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన పత్రాలను అందజేశారు.
అంతకుముందు పొట్టి శ్రీరాములు నగర్లో ఇటీవల నిర్మించిన పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని మంత్రి కేటీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అకడి నుంచి సీసీనగర్ వరకు మంత్రి కేటీఆర్‌కు మహిళలు, హారతులు, బోనాలు, పోతురాజుల నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఇల్లు కట్టి చూడు..పెండ్లి చేసి చూడు అని పెద్దలు ఊరికే అనలేదని, ఈ రెండు ఎంతో కష్టంతో కూడుకున్నవని అన్నారు. “ కానీ ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తానన్న” ఏకైక సీఎం కేసీఆరే అని చెప్పారు. దేశంలో ఎకడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు ఉచితంగా అందజేస్తుందని చెప్పారు. ప్రభుత్వ కట్టించి ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రైవేట్ పరంగా రూ.40లక్షల విలువజేస్తాయని కేటీఆర్ వివరించారు.
అంతేకాకుండా పేదింటి ఆడపడుచుల పెండ్లికి ఒక లక్ష 116 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వమే అందిస్తుందని, దేశంలోని మిగతా 28 రాష్ర్టాలు ఇలాంటి కార్యక్రమాన్ని అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చిన ఘనత ఒక తెలంగాణ ప్రభుత్వానికే దకుతుందని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత పింఛన్ 10 రెట్లు పెంచామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూ.200గా ఉన్న పెన్షన్‌ను రూ.2వేలు చేశామన్నారు. తెలంగాణ వచ్చాక విద్యుత్, తాగునీటి సమస్యలు పరిష్కరించామని తెలిపారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ అని, ఇప్పటి వరకు రూ.11వేల కోట్లు ఖర్చు చేశామని కేటీఆర్ అన్నారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసి పేదలందరికీ అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో లబ్ధిదారులపై ఒకపైసా భారం పడకుండా ప్రభుత్వమే ఇండ్లను నిర్మించి ఇస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. గతంలో 15, 20, 30 గజాలలో అరకొర వసతులతో జీవించిన పేదలకు ప్రస్తుతం అన్ని మౌలిక వసతులతో కూడిన 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం నిర్మించిన ఇండ్లను లబ్ధిదారుల సమక్షంలోనే అర్హులను గుర్తించి లాటరీ పద్ధతిలో కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందజేసిన ఇండ్లను అమ్మినా, కొన్నా చర్యలు తప్పవని ఈ సందర్భంగా తలసాని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెన్షన్లు, ఉచితంగా 24 గంటలు విద్యుత్ సరఫరా, కేసీఆర్ కిట్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలను 25 సంవత్సరాల పాటు కన్నబిడ్డల్లా కాపాడుకున్నామని తలసాని చెప్పారు. వారికి ఆపద వచ్చినప్పుడు అన్ని విధాలా ఆదుకోవడం తన బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, కలెక్టర్ శర్మన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, కార్పొరేటర్లు కుర్మ హేమలత, కొలన్ లక్ష్మి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, పద్మారావు నగర్ ఇన్చార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కొందరు దళారులు ఇండ్లు ఇప్పిస్తామని మాయమాటలు చెబుతున్నారని.. అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి కేటీఆర్ కోరారు. ఇండ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని, లాటరీ పద్ధతిలో బస్తీవాసులకు ఇండ్లు కేటాయిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.18 వేల కోట్లను కేటాయించగా రూ. 11 వేల కోట్లను ఖర్చు చేశామని.. మిగిలిన ఇండ్ల నిర్మాణాలను త్వరిగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
అర్హులైన పేదలందరికీ న్యాయం జరిగేలా డబుల్ బెడ్ రూం ఇండ్లను అందిస్తున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రూ.18వేల కోట్ల విలువైన ఇళ్లను మంజూరు చేయగా రూ.11 కోట్ల విలువ గల గృహాలు పూర్తి చేసి పేదలకు అందజేసినట్లు మంత్రి తెలిపారు. పేదలు ఆత్మగౌరవంగా బతకాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గృహ నిర్మాణాలకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేయడానికి సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి వేముల తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను సీఎం కేసీఆర్ నిర్మిస్తున్నారని, నెహ్రూ జమానా నుంచి పేదలకు ఎవ్వరూ కూడా గృహాలు నిర్మించలేదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. చాచా నెహ్రూనగర్‌లో గృహాలు నిర్మించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీ, ఆసరా ఫించన్ లాంటి పథకాలు భారతదేశంలో మరెక్కాడా లేవని హోం మంత్రి మంత్రి తెలిపారు.
చాచానెహ్రూనగర్‌లో ఉంటున్న మేము నలభై ఏండ్లుగా అనేక కష్టాలు పడ్డాం. ఇన్నాండ్లకు మా కల నెరవేరింది. మా గరీబోళ్ళ జీవితాలలో వెలుగులు వచ్చాయి. మేము గుడిసెలోనే జీవితం వెళ్లదీశాం. సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ యాదవ్ సంకల్పంతో ఇప్పుడు మేము సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా చక్కటి గృహం లభించింది. – మక్కల లక్ష్మణ్ కుటుంబం
గరీబోళ్లకు మేలు చేసే ప్రభుత్వం ఇది
పేదల కష్టాలను తొలగించే ప్రభుత్వాలకు ఎల్లకాలం ప్రజల మద్దతు లభిస్తుంది. దేశ చరిత్రలో పేదలకు రెండు పడక గదుల ఇల్లు ఉండాలని ఎవరైనా ఆలోచన చేశారా? ఇలాంటి అద్భుతమైన పథకం దేశంలో ఒక్క మన తెలంగాణాలో తప్ప మరెక్కడా అమలు కావడం లేదు. మేము పడ్డ బాధలు మా తరువాతి తరం వాళ్లు పడకూడదు. అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని నమ్మాం. ఇప్పుడు సకల సదుపాయాలతో నిర్మించిన ఇండ్లు లభించాయి. – పల్లెపు రేణుక కుటుంబం