హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం తాగే వాళ్లు కోటిమంది ఉన్నారు. కోటి ఓట్లు మాకు వెయ్యండి. చీప్ లిక్కర్ రూ.75కే ఇస్తాం. రెవెన్యూ బాగుంటే.. రూ.50కే ఇస్తాం’.. ఏపీలోని విజయవాడలో బీజేపీ నిర్వహించిన ప్రజాగ్రహ సభలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలివి. ఓట్లకోసం బీజేపీ చీప్ పాలిటిక్స్‌కు ఇంతకు మించిన తార్కాణం ఇంకొకటి లేదేమో. ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతారన్నమాట. అడ్డగోలుగా మాట్లాడటంలో ఏపీ బీజేపీ నేతలు తెలంగాణలోని వారి పార్టీ నేతలను సైతం మించిపోయారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఏపీలో ఏదైనా అభివృద్ధి కోసమో.. ప్రగతికోసమో కాకుండా.. నాణ్యమైన చీప్ లిక్కర్ కోసం 2024లో వాళ్లకు ఓట్లేయాలంట. మొదట్నుంచీ మతం మత్తులో ఓట్లను దండుకొంటున్న బీజేపీకి తాజాగా మద్యం మత్తు కూడా నయా ఓట్ల ఎరగా కనిపిస్తున్నట్టున్నది. సోము వీర్రాజు వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నది. అధికారం కోసం ఇంతగా దిగజారడమేమిటని నిందిస్తున్నారు. ఇదేనా మీ విధానం అంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు సైతం తీవ్రంగా స్పందించారు.
ఇంత దిగజారుతారా? మంత్రి కేటీఆర్
సోము వీర్రాజు చీప్ లిక్కర్ వ్యాఖ్యలపై రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘వాహ్.. వాట్ ఏ స్కీం..! వాట్ ఏ షేమ్.. అధికారం కోసం ఏపీ బీజేపీ నేతలు మరీ ఇంతగా దిగజారుతారా? రూ.50కే చీప్ లిక్కర్ పంపిణీ అనేది బీజేపీ జాతీయ విధానమా? లేక బీజేపీ బలహీనంగా ఉన్న రాష్ర్టాలకు మాత్రమేనా?’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ ట్వీట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు.
ట్రోల్స్‌తో ఆడుకుంటున్న నెటిజన్లు
సోము వీర్రాజు చేసిన చీప్ లిక్కర్ వ్యాఖ్యలపై నెటిజన్లు ట్రోల్స్‌తో ‘చుక్క’లు చూపిస్తున్నారు. ఎమోజీలు, వీడియోలతో పిచ్చెక్కిస్తున్నారు. ఏకంగా ఓ నెటిజన్ సాగరసంగమం సినిమాలో హీరో కమల్‌హాసన్ మద్యం తాగుతూ పాడే పాటను జతచేసి ‘తకిటతధిమి తకిటతధిమి తందానా’ అంటూ వీర్రాజును ఆడుకొన్నారు. ఇంకో నెటిజన్ ‘ఆ త్రిశూలం అందుకో జానకీ..’ అంటూ తనదైన శైలిలో కృష్ణంరాజు డైలాగ్ యాడ్చేశారు. పరమేశ్వర్ అయ్యవారి ముదిరాజ్ అనే నెటిజన్.. ‘మా తెలంగాణనే అనునుకున్న.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీజేపీకి అద్భుత నాయకత్వమే ఉన్నది. ఇసొంటి ఇంకో నాలుగు స్కీంలు ఎన్నికల టైంలో రిలీజ్ చేయండి.. ఇక మీకు తిరుగులేదు’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. చంద్రశేఖర్ అనే మరో నెటిజన్ అయితే ‘లిక్కర్ తాగేవాళ్లు ఒక కోటి మందే ఉండొచ్చు.. పెట్రోల్ 6 కోట్ల మంది వాడతారు.. పెట్రోల్ రూ.50కి ఇవ్వండి సారాయి వీర్రాజూ’ అంటూ తలంటినంత పనిచేశారు. ‘ఇంటింటికీ పైపు లైన్ వేసి నీళ్ల బదులు లిక్కర్ ఇవ్వండి’ అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. ఇటీవల ఫేమస్ అయిన సుఖీభవ డైలాగ్‌ను సైతం నెటిజన్లు తమదైన శైలిలో వాడేశారు. ‘మంచి రోజులు తెస్తామన్న బీజేపీ చివరికి మందు రోజులు తేబోతున్నదన్నమాట..’ అంటూ మరో నెటిజన్ అన్నారు. అంగోత్ వెంకటేశ్ పవార్ అనే మనో నెటిజన్ ఒకడుగు ముందుకువేసి.. బీజేపీ అంటే.. బ్లెండర్స్ ప్రైడ్.. జానీ వాకర్.. పార్టీ.. అని తేల్చిపడేశాడు.