తెలంగాణపై మొదట్నుంచీ కేంద్రం దాడి
ప్రగతిశీల రాష్ర్టాలకు తీవ్ర నిరుత్సాహం
రాష్ర్టాలకు ఉన్న అధికారాల కబళింపు
తెలంగాణ పుట్టుకనే తప్పుపట్టిన ప్రధాని
మనోభావాలను దెబ్బతీస్తున్న కేంద్రం
కేంద్రంపై మంత్రి హరీశ్‌రావు ధ్వజం
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం పురుడుపోసుకొన్న నాటినుంచే తెలంగాణపై కేంద్రం దాడి మొదలైందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఢిల్లీ సర్కారుపై ధ్వజమెత్తారు. సోమవారం బడ్జెట్ ప్రసంగం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించడంలేదని విమర్శించారు. తెలంగాణ పరిభాషలో చెప్పాలంటే ‘కాళ్లల్లో కట్టె పెట్టినట్టు’గా కేంద్రం వైఖరి ఉన్నదని అన్నారు. ప్రగతిశీల రాష్ర్టాలకు ప్రోత్సాహం ఇవ్వకపోగా నిరుత్సాహం కలిగించేలా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం ఆవిర్భావ దినోత్సవాలనైనా జరుపుకోకుండానే ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను అక్రమంగా ఏపీకి బదలాయించడంతో లోయర్ సీలేరు విద్యుత్తు ప్రాజెక్టును కోల్పోయామన్నారు. ఇవి చాలవన్నట్టుగా తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ పదే పదే వ్యాఖ్యానిస్తూ కేంద్ర పెద్దలు తెలంగాణ మనోభావాలను దారుణంగా దెబ్బ తీస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఐటీఐఆర్‌ను అమలుచేసి ఉంటే తెలంగాణ ఐటీ మరింతగా పురోగమించేదని, ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి లభించేదని చెప్పారు. రాష్ట్రంలో ఆనాటి 9 ఉమ్మడి జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించినప్పటికీ.. నిధులివ్వడంలో తీరని అన్యాయం చేసిందని చెప్పారు. సహకార సమాఖ్య అని గొప్పగా చెప్తూనే.. రెండోవైపు ఆ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ర్టాల అధికారాలను కబళిస్తున్నదని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
తాజా బడ్జెట్లోనూ అన్యాయమే
కేంద్రం తాజా బడ్జెట్లోనూ రాష్ట్రానికి అన్యాయమే చేసిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఒక ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వలేదని, ఏ ఒక పథకానికీ డబ్బులు ఇవ్వలేదని గుర్తుచేశారు. అంతా శుషప్రియాలు, శూన్యహస్తాలన్నారు. కనీసం మనమే స్వయంగా రుణం తెచ్చుకోనైనా అభివృద్ధి చేసుకుందామనుకుంటే దానికీ కేంద్రం మోకాలడ్డుతున్నదని విమర్శించారు. కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలో నుంచి న్యాయబద్ధంగా 41 శాతం రాష్ట్రాలకు రావాల్సి ఉన్నప్పటికీ, ఈ వాటాను కుదించడానికి సెస్సుల రూపంలో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటున్నదని ఆరోపించారు. సెస్సుల రూపంలో వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఉండదనే అంశాన్ని ఆసరా చేసుకొని రాష్ర్టాల ఆదాయంలో 11.4 శాతం ఆదాయానికి కేంద్రం గండికొడుతున్నదని చెప్పారు. 41 శాతం రావాల్సిన చోట 29.6 శాతం మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తున్నదని వెల్లడించారు. ఈ నిర్వాకాన్ని 15వ ఆర్థిక సంఘం తప్పుపట్టినా.. ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్న చందంగా కేంద్రం వ్యవహరిస్తున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. కరోనా సమయంలోనూ కేంద్రం రూపాయి ఇవ్వలేదని గుర్తుచేశారు. కంటితుడుపుగా రుణపరిమితిని పెంచుతూ అమలుకు షరతులు విధించిందని గుర్తుచేశారు.
కంఠంలో ప్రాణముండగా.. మోటర్లకు మీటర్లు పెట్టేది లేదన్న సీఎం
ఎఫ్ఆర్బీఎం పెంపుదలకు, విద్యుత్తు సంసరణలకు లంకె పెడుతూ.. కేంద్రం రాష్ట్రాల మెడ మీద కత్తి పెట్టిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతు వ్యతిరేక విద్యుత్తు సంసరణలు అమలు చేయకపోవడం వల్ల తెలంగాణ ఏటా రూ.5 వేల కోట్లు సమకూర్చుకొనే అవకాశం కోల్పోయిందని తెలిపారు. దీంతో ఐదేండ్లలో రూ.25 వేల కోట్లు నష్టపోతున్నట్టు చెప్పారు. దీన్ని బట్టి కేంద్రం ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నదో అర్థం చేసుకోవచ్చన్నారు. రూ.25 వేల కోట్ల కోసం చూస్తే బాయిలకాడ మీటర్లు పెట్టి, రైతుల నుంచి కరెంటు చార్జీలు వసూలు చేయాల్సి వస్తుందని చెప్పారు. రైతుల మీద చార్జీల భారం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏ మాత్రం సిద్ధంగా లేదని స్పష్టంచేశారు. ‘కంఠంలో ప్రాణం ఉండగా విద్యుత్తు సంసరణలకు ఒప్పుకోబోము’ అని సీఎం కేసీఆర్ కేంద్రానికి తెగేసి చెప్పారని వెల్లడించారు. 4 కోట్ల ప్రజల శ్రేయస్సు కోసం రూ.25 వేల కోట్లు వదులు కోవడానికే సీఎం సిద్ధపడ్డారని తెలిపారు. ‘ఎందుకంటే మాది రైతు ప్రభుత్వం కనుక.. రైతు బిడ్డ పాలిస్తున్న ప్రభుత్వం కనుక’.. అని హరీశ్‌రావు స్పష్టంచేశారు.
కేంద్ర నిధులు లేవు.. ప్రోత్సాహకాలూ లేవు
కొత్త రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపుతోపాటు ఇతర ప్రోత్సాహకాలను ఇవ్వాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 94 (1) పేరొన్నప్పటికీ చెప్పుకోదగ్గ ప్రోత్సాహకాలేవీ కేం ద్రం ఇవ్వలేదని హరీశ్‌రావు ఆక్షేపించారు. బయ్యా రం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలు అతీగతీ లేవని, రైల్వే కనెక్టివిటీని పెంచే ప్రతిపాదనలు పెండింగ్‌లో పెట్టిందని చెప్పారు. కొత్త రాష్ర్టానికి అదనపు నిధులు ఇవ్వాలని కేంద్రానికి పలు ప్రతిపాదనలు పంపినప్పటికీ ఒక్కపైసా ఇవ్వలేదని విమర్శించారు. రూ.24 వేల కోట్ల ప్రత్యేక నిధులివ్వాలని నీతి ఆయో గ్ చేసిన సిఫారసులూ బుట్టదాఖలయ్యాయన్నారు. గిరిజన వర్సిటీకి కంటితుడుపుగా 20 కోట్లను విదిల్చిందని చెప్పారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు తెలంగాణకు విడుదల చేయాల్సిన రూ.495 కోట్లను పొరపాటున ఏపీ ఖాతాలో జమచేసిందని.. ఏడేండ్ల నుంచి మన డబ్బులు మనకివ్వాలని కోరుతున్నా ఇవ్వలేదంటే.. కేంద్రం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చన్నారు. జహీరాబాద్ నిమ్జ్ కు కేం ద్రం వాటా రూ.500 కోట్లను కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. సాధారణంగా ఆర్థిక సంఘాల సిఫారసును కేంద్రం ఆమోదించడం ఆనవాయితీ అని.. ప్రస్తుత సర్కారు ఆ ఆనవాయితీని ఏమాత్రం పాటించడంలేదని విమర్శించారు. 15వ ఆర్థిక సంఘం 2020-21లో రాష్ర్టానికి రూ.723 కోట్లను ప్రత్యేక గ్రాంటుగా ఇవ్వాలని చేసిన సిఫారసులను కేంద్రం బుట్టదాఖలు చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.2,362 కోట్ల గ్రాంట్స్ విడుదల చేయలేదన్నారు. అదేవిధంగా సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్లు రూ.3,024 కోట్లు ఇవ్వలేదని తెలిపారు.
ప్రజల ప్రియమే పాలకుడి ప్రియం
ప్రజాహితమే పాలకుడి హితమని ప్రబలంగా నమ్మే పరిపాలకుడు సీఎం అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. సోమవారం బడ్జెట్ ప్రసంగం చివరలో మహాభారతం అనుశాసనిక పర్వంలోని శ్లోకాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పారు. ప్రజాకార్యం తు తత్కార్యం ప్రజా సౌఖ్యం తు తత్సుఖం ప్రజాప్రియః ప్రియస్తస్య, స్వహితం తు ప్రజాహితం(మహాభారతం అనుశాసనిక పర్వం, 212-26)దీని అర్థం ‘ప్రజల పనే పాలకుడి పని.. ప్రజల సుఖమే పాలకుడి సుఖం.. ప్రజల ప్రియమే పాలకుడి ప్రియం.. ప్రజల హితమే పాలకుడి హితం’.. ఈ శ్లోకంలోని ప్రతి అక్షరాన్ని సీఎం కేసీఆర్ దృఢంగా విశ్వసిస్తారని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ అభ్యుదయం గురించిన తపనే తప్ప సీఎం కేసీఆర్‌కు వేరే చింతనే లేదన్నారు. సీఎం సారథ్యంలో ప్రజా ప్రభుత్వంగా, పేద, దళిత, వెనుకబడిన వర్గాల ప్రభుత్వంగా మన్ననలు అందుకొంటున్నదని చెప్పారు. ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగిస్తామని, ఎంతటి కఠిన లక్ష్యాలనైనా సాధించగల ధీరత్వం, ఆత్మవిశ్వాసం తమకున్నదని.. అదే తమ బలమని అన్నారు. ప్రతీఘాత శక్తులు ఎన్ని అవరోధాలను సృష్టిస్తున్నా వాటిని జయించగల సత్తా తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నదన్నారు. ప్రజల మీదే తమ విశ్వాసం ఉన్నదని, మనసా వాచా కర్మణా ప్రజల శ్రేయస్సు కోసమే కృషిచేస్తామని ఉద్ఘాటించారు.