సిద్దిపేట, జనవరి 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/సిద్దిపేట అర్బన్/గజ్వేల్: ‘గొంతు పెద్దదిగా చేసుకొని మాట్లాడితే అబద్ధాలు నిజాలు కావు. ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ప్రచారం చేసి లబ్ధ్దిపొందాలని చూస్తున్నారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పితే నిజమైతదన్న రీతిలో బీజేపీ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. బండి సంజయ్.. నీకు నిజాయితీ ఉంటే ఢిల్లీకి వెళ్లి దేశంలో ఖాళీగా ఉన్న 15 లక్షల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రధాని మోదీ తో కొట్లాడు’ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. సిద్దిపేట రూరల్ మండలంలోని ఇర్కోడు గుట్టపై నియోజకవర్గ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరులో రూ.4.30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. గజ్వేల్ ప్రభుత్వ దవాఖానను తనిఖీ చేశారు. అనంతరం మీడియాతోనూ మాట్లాడారు. దొంగమాటలతో బీజేపీ నాయకులు చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి జీవో 317 వచ్చిందని, ప్రధాని సంతకం పెట్టి, కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేస్తారని చెప్పారు. దానిని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్డరే జీవో 317అని తెలిపారు. కేంద్రం ఇ చ్చిన ఉత్తర్వులను రాష్ట్రం అమలు చేస్తున్నదని.. దానిని రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేపడుతున్నాడని విమర్శించారు. బండి దీక్ష కేంద్ర ప్రభుత్వం మీదనా? ప్రధాని మోదీ మీదనా? అని ప్రశ్నించారు.
తెలంగాణలోనే ఎక్కువ..
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోని జనాభాలో ఉద్యోగుల శాతం కంటే తెలంగాణలోనే ఎక్కువ ఉన్నారని హరీశ్‌రావు తెలిపారు. కర్ణాటక, గుజరాత్, బీహార్ రాష్ర్టాల్లో ఉండే జనాభాలో ఉద్యోగుల సంఖ్య ఎంత? అని ప్రశ్నించారు. కర్ణాటకలో ఉద్యోగులు 1.2 శాతం అని, 30 ఏండ్ల నుంచి పాలిస్తున్న గుజరాత్లో 1.1 శాతం, బీహార్‌లో 0.3 శాతమని వెల్లడించారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌లో ఒక శాతం ఉంటే తెలంగాణలో 3 శాతం ఉన్నారని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ప్రతి వంద మందికి ముగ్గురు ఉద్యోగులు ఉన్నారని ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నీతి ఆయోగ్ నివేదికల్లోని అనేక అంశాల్లో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందన్న విషయం స్పష్టమైందన్నారు.
ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం..
ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని హరీశ్‌రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని దవాఖానలు, ఏఎన్ఎం కేంద్రాల్లో 2 కోట్ల కరోనా కిట్లు, కోటి హోం ఐసోలేషన్ కిట్లను సిద్ధంగా ఉంచామన్నారు. ప్రతి దవాఖానలో ఆక్సిజన్, ఐసీయూ, ప్రత్యేకంగా బెడ్స్‌ను ఏర్పాటుచేశామని చెప్పారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణశర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఉన్నారు.
త్వరలో మరో 70 వేల ఉద్యోగాలు నింపుతాం
ఉద్యోగుల్లో కూడా 85 శాతం సంతోషంగా ఉన్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేవలం 10 నుంచి 12 శాతం మందే ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని చెప్పారు. బీజేపీ నాయకులు అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ నాయకుల మాట లు చూసి ఉద్యోగులే నవ్వుకొంటున్నారన్నారు. ఉద్యోగ సంఘాల మద్దతు కూడా వారికి లేదని చెప్పారు. పద్ధతి ప్రకారం చేయకపోతే ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఊరుకుండేవారా? అని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి ప్రభుత్వం పనిచేసిందని పునరుద్ఘాటించారు. జీవో 317తో నిరుద్యోగులకు న్యా యం జరుగుతుందని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమ న్యాయం చేయాలన్నదే దీని ఉద్దేశమని చెప్పారు. ఉద్యోగుల కోసం మాట్లాడుతున్న బీజేపీ నాయకులు.. కేంద్రం పరిధిలోని 15,62,912 ఉద్యోగాలను భర్తీ చేయించాలని హితవు పలికారు. రైల్వేశాఖలో 3 లక్షల ఉద్యోగాలు, డిఫెన్స్‌లో 2 లక్షలు, బ్యాంకింగ్ సెక్టార్లో 33 వేలు, ఇతరత్రా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి పోరాడాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, మరో 70 వేల ఉద్యోగాలు నింపేందుకు సిద్ధంగా ఉన్నదని వివరించారు.