హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యమంతా కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై సోమవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,033 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇంకా ఎక్కడైనా అవసరమైతే వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గన్నీ సంచులకు కొరత లేదని, అవసరమైనన్ని అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా చూసేందుకు టార్పాలిన్లు అందించనున్నట్టు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించేందుకు పౌరసరఫరాల విభాగంలోని ఐటీ వింగ్‌ను మరింత బలోపేతం చేయనున్నట్టు మంత్రి గంగుల వెల్లడించారు.