వరంగల్ : విద్యార్థులు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తాను చదువుకున్న పర్వతగిరి పాఠశాలకు ఐదు లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆధ్వర్యంలో వారి తండ్రి ఆరూరి గట్టు మల్లు స్మారకార్ధం ప్రతి ఏటా పర్వతగిరి హై స్కూల్లో ఏర్పాటు చేసే గురుపూజోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి సొంతంగా ఐదు లక్షల రూపాయల చెక్కును పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులకు మంత్రి అందజేశారు. అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గురువులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గొప్ప మార్గదర్శకులన్నారు. గురువుల శిక్షణలో పిల్లలు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తూ.. ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, గొప్పగా ఎదిగి కన్న తల్లిదండ్రులకు, దేశానికి పేరు తేవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా తాను చదువుకున్నప్పటి చిన్న నాటి గురుతులను అక్కడి విద్యార్థులతో పంచుకున్నారు. అనంతరం మంత్రి ఉపాధ్యాయులను సత్కరించి వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.