జనగామ : గత అనుభవాలను దృష్టిలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. శనివారం స్థానిక వైష్ణవి గార్డెన్స్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులు, కొనుగోలు కేంద్రాల బాధ్యులు, రైతుబంధు సమన్వయ సమితి సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లను అధికారులు, ప్రజాప్రతినిధులు సవాల్‌గా తీసుకొని విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
గతేడాది కరోనా కాలంలో ఎంతో కష్టపడి చేశారన్నారు. దేవాదులతో భూగర్భజలాలు పెరిగి, చెరువులు, బావుల్లోకి నీరు పుష్కలంగా చేరిందన్నారు. రైతులకు 24గంటల విద్యుత్, పంట పెట్టుబడి, సాగునీరు ఇవ్వడంతో పాటు ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం వరి కొనడం లేదని, ఎఫ్ఐసీ ఇబ్బందులు పెడుతుందన్నారు. అయినా, రైతు పండించిన ప్రతి గింజనూ కొనేలా ఏర్పాట్లు చేశామన్నారు.
వ్యవసాయాధికారులు యాసంగిలో ఏ పంట, ఏ విత్తనాలు వేస్తే బాగుంటుంది, ఎక్కువ లాభాలు వస్తాయో.. ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి సభ్యులు సమావేశాలు నిర్వహించి రైతులను చైతన్య వంతులను చేయాలన్నారు. వరితో పాటు ఇతర పంటలు, లేపాక్షి పల్లి పంట వేస్తే ఎకరాకు రూ.2 నుంచి రూ.3లక్షలు, డ్రాగన్ ఫ్రూట్ పంటలో ఎకరానికి కనీసం రూ.5లక్షల వరకు లాభాలుంటాయన్నారు. జిల్లాలో తేమశాతం పెరగడంతో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉంటుందని, జిల్లాలో పామ్ ఆయిల్ ఇండస్ట్రీ మూడేండ్లలో సిద్ధం కానున్నట్లు చెప్పారు. పామ్ ఆయిల్ పంటకు కోతుల, రోగాల బెడద ఉండదని, ఎకరాకు రూ.36వేల సబ్సిడీ వస్తుందని.. లాభసాటిగా ఉందని.. ఈ దిశ రైతులను ప్రోత్సహించాలన్నారు.
దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ వరిని కొనడం లేదని, రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రూ.2,500కోట్ల నష్టం వస్తుందన్నారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం నష్టాన్ని భరిస్తుందని పేర్కొన్నారు. రైస్ మిల్లర్లు రైతులు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కోరారు. సర్పంచులు, ఎంపీటీసీలు, రవాణాపరంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సహకరించాలని సూచించారు. ఒక్కో అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి పర్యవేక్షణ చేపట్టాలన్నారు. నవంబర్ 6 నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు.
అధికారులు సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ శివలింగయ్య, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, అబ్దుల్ హామీద్, రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణా రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బీ విజయ, జనగామ డీసీఓ కిరణ్ కుమార్, రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట నారాయణ గౌడ్, జిల్లా అధికారులు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు, కేంద్రాల బాధ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.