కోదాడ, మార్చి 6 : దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న రేషన్ దుకాణాల ద్వారా ఇక నుంచి ఐదు కేజీల ఎల్పీజీ సిలిండర్లను కూడా సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో నేటికీ పేదలు వంట కోసం కట్టెలనే వినియోగిస్తున్నారు. దాంతో పొగ మసితో వారు అనారోగ్యం బారిన పడుతున్నారు. దానికి చెక్‌పెడుతూ పేదల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని సబ్సిడీపై సిలిండర్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆయిల్‌కంపెనీలు, రేషన్‌డీలర్ల సంఘం నాయకులతో సమావేశం ఏర్పాటుచేసి సిలిండర్ల సరఫరా యాక్షన్ ప్లాన తయారు చేశారు.
ఆహార భద్రత కార్డుతో పాటు ఆధార్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ మినీ సిలిండర్లను అందజేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో పీఓఎస్ బయోమెట్రిక్, ఐరిష్ విధానంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. అయితే రేషన్ దుకాణాల ద్వారా అందించే సరుకులను పెంచి డీలర్ల కమీషన్ సైతం పెంచాలని డీలర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దాంతో ప్రభుత్వం సరుకులతో పాటు మినీ సిలిండర్లను అందించాలని నిర్ణయించింది.
ప్రస్తుతం 14.2 కేజీల సిలిండర్లను గృహ అవసరాలకు వినియోగిస్తుండగా, వ్యాపార, వాణిజ్య అవసరాల కోసం 19 కేజీల సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. మధ్యతరగతి, ఉన్నత కుటుంబాల వారు ఆయా సిలిండర్లను వినియోగిస్తున్నప్పటికీ అత్యంత వెనుకబడ్డ గ్రామీణ ప్రాంత కుటుంబాలు ఇప్పటికీ కట్టెల పొయ్యినే వాడుతున్నారు. దాంతో పొగతో వారు అనారోగ్యం బారిన పడుతున్నారు. దాంతో పాటు కట్టెల కోసం చెట్లను నరికి వేస్తుండడంతో అటవీశాతం తగ్గిపోతోంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం 5 కేజీల సిలిండర్లను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ప్రభుత్వం భారత్, ఇండేన్, హెచ్‌పీ వంటి గ్యాస్ సరఫరా చేసే కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి నెల గ్యాస్ కంపెనీలు రేషన్ డీలర్లకు 5 కేజీల సిలిండర్లను సరఫరా చేయనున్నాయి. రేషన్ డీలర్లకు ఒక్కో సిలిండర్‌పై రూ. 41 కమీషన్ చెల్లించనున్నారు. దాంతో వారికి మరింత ఆదాయం రానున్నది. అయితే సిలిండర్ కావాల్సిన వినియోగదారుడు మొదటిసారి రూ. 940 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత రూ. 620కే సిలిండర్ అందిస్తారు.
బ్లాక్ మార్కెట్లో 2.5 కేజీల సిలిండర్‌లో గ్యాస్ నింపి ఇస్తే రూ. 300,5 కేజీలు నింపితే రూ. 600కు పైగా తీసుకుంటున్నారు. దానికి తోడు గృహ అవసరాల సిలిండర్ నుంచి అక్రమంగా చిన్న సిలిండర్‌లోకి గ్యాస్ నింపి విక్రయిస్తున్నారు. రేషన్ దుకాణాల ద్వారా మినీ సిలిండర్లు అందుబాటులోకి వస్తే బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్ట వేయవచ్చు.
రేషన్ దుకాణాల ద్వారా మినీ సిలిండర్లను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం. ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా కేవలం బియ్యం మాత్రమే సరఫరా అవుతున్నాయి. దాంతో కమిషన్ తక్కువగా వస్తున్నది. మినీ సిలిండర్‌కు రూ. 41 కమిషన్ చెల్లించడం ద్వారా అదనపు ఆదాయం రానున్నది.
-యాదా సుధాకర్, రేషన్ డీలర్స్ అసోసియేషన్ నాయకుడు
జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా మినీ సిలిండర్లను పంపిణీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ప్రభుత్వ ఆదేశాలు రాగానే పంపిణీ ప్రారంభిస్తాం. ఇప్పటికే గ్యాస్ సరఫరా చేస్తున్న వివిధ కంపెనీలు, రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించాం. కంపెనీలు సైతం హామీ ఇవ్వడంతో త్వరలో పంపిణీకి చర్యలు తీసుకుంటాం.
– సీహెచ్ రాజశేఖర్, డిప్యూటీ తాసీల్దార్ (పౌరసరఫరాలు)