ఉమ్మడి మహబూబ్‌నగర్ అంటే ఒకప్పుడు వలసల జిల్లా. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ తలరాతను మార్చారు. పాలకుడిగా పాలమూరు జిల్లాకు కృష్ణమ్మను పరుగులు పెట్టించి, వలసలు వాపస్ వచ్చేలా చేశారు. అంతేకాదు.. ఇరుగుపొరుగు ప్రాంతాల నుంచి ఆ జిల్లాకే వలసలు వచ్చేలా చేయగలిగారు.
- తలాపున కృష్ణ, తుంగభద్ర నదులు
- సాగునీటికి కటకటతో అన్నదాత తిప్పలు
- కరెంటు కోతలతో ఎండుతున్న పంటలు
- పొలం పనులు లేక రైతుల పట్నంబాట
- సీఎం సొంత జిల్లాలో దారుణ పరిస్థితులు
మహబూబ్‌నగర్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/గద్వాల: ఉమ్మడి మహబూబ్‌నగర్ అంటే ఒకప్పుడు వలసల జిల్లా. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ తలరాతను మార్చారు. పాలకుడిగా పాలమూరు జిల్లాకు కృష్ణమ్మను పరుగులు పెట్టించి, వలసలు వాపస్ వచ్చేలా చేశారు. అంతేకాదు.. ఇరుగుపొరుగు ప్రాంతాల నుంచి ఆ జిల్లాకే వలసలు వచ్చేలా చేయగలిగారు. కానీ.. కాంగ్రెస్ పాలనలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరువు ఛాయలు అలుముకుంటున్నాయి. ఓవైపు ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులు, మరోవైపు కరెంట్ కోతలు అన్నదాతలను కుంగదీస్తున్నాయి. తలాపున కృష్ణ, తుంగభద్ర, భీమా నదులు ప్రవహిస్తున్నా.. సొంత జిల్లా రైతులకు సాగునీరు అందించడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారు. దీంతో నడిగడ్డగా పిలిచే జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన రైతులు మళ్లీ వలసబాట పడుతున్నారు. గట్టు మండలంలో ‘నమస్తే తెలంగాణ’ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించగా, విషాదకర వాతావరణం కనిపించింది.
కూలీలు వచ్చినచోట.. కూలి కోసం వలస
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరత కారణంగా ఈ సీజన్లో సాగు విస్తీర్ణం తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చాలాచోట్ల క్రాప్ హాలిడేలు ప్రకటించారు. కొందరు బోర్లలో ఉన్న నీటిని నమ్ముకొని పంట సాగుచేయగా, వారి పరిస్థితి దారుణంగా తయారైంది. బోర్లల్లో అరకొర నీళ్లున్నా, కరెంట్ కోతలతో ఆ నీటిని వినియోగించే పరిస్థితి లేదు. దీంతో పంట చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. కొందరు పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. దీనికితోడు యాసంగి పంట వేసుకోవద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో అన్నదాతలు పూర్తిగా కుంగిపోయారు. ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. ఇప్పటికే జోగులాంబ గద్వాల జిల్లాలో వలసలు ప్రారంభం అయ్యాయి.
వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం వానకాలం సీజన్లో జోగులాంబ గద్వాల జిల్లాలో 3,29,136 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ప్రధానంగా పత్తి 1.72 లక్షల ఎకరాల్లో, వరి 79 వేలు, మిర్చి 30వేలు, కంది 27 వేల ఎకరాల్లో సాగయ్యాయి. వర్షాభావం, ప్రభుత్వం సాగునీరు సకాలంలో విడుదల చేయకపోవడం, కరెంట్ కోతలతో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని జిల్లా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా గట్టు మండలంలో పరిస్థితులు మరింత దిగజారాయి. గత ఏడాదివరకు ఇతర రాష్ర్టాల నుంచి కూలీలను రప్పించుకొని, పనులు చేయించిన నడిగడ్డలో ప్రస్తుతం కూలి పనుల కోసం వలస వెళ్తున్నారు. ఓవైపు పంటలు ఎండిపోయి పెట్టుబడి రాని పరిస్థితి, మరోవైపు అప్పులు, వడ్డీలు వెంటాడుతుండడంతో కుటుంబాలను ఊళ్లలోనే వదిలేసి పట్నం బాట పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరిపడా కరెంట్ సరఫరా చేస్తే, కొంతమేరకైనా పంటలను కాపాడుకోవచ్చని అన్నదాతలు పేర్కొంటున్నారు.
శాపంగా మారిన ప్రభుత్వ నిర్లక్ష్యం
ఉమ్మడి పాలమూరులో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని జిల్లావాసులు ఆరోపిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నా, కృష్ణా నదికి ఈ సీజన్లో భారీ స్థాయిలో వరద వచ్చిందని గుర్తు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడంతో పరిస్థితులు చేజారిపోయాయన్నారు. జూరాల నుంచి పూర్తిస్థాయిలో పంపింగ్ చేయకపోవడం, జూరాల సోర్స్‌గా ఉన్న ప్రాజెక్టులకు సకాలంలో నీటి విడుదల చేయకపోవడం, కుడి ఎడమ కాలువలకు నీళ్లు రాకపోవడంతో పరిస్థితులు తలకిందులు అయ్యాయి. ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు నీటి విడుదలలో జాప్యంతో గద్వాల, వనపర్తి, నారాయణపేట తదితర ప్రాంతాలు సాగునీటికి నోచుకోలేకపోయాయి. రైతులు ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించలేదు.
రైతులే హెడ్ రెగ్యులేటరీ వద్ద ఉన్న తూములు తెరుచుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మరోవైపు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు ఇతర ప్రాజెక్టుల మోటార్లను ఆన్ చేసి, శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటిని ఎత్తిపోయాలని బీఆర్ఎస్ నేతలు, సాగునీటి రంగ నిపుణులు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దీంతో నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సాగునీటి సంక్షోభం ఏర్పడింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో మళ్లీ వలసబాట పట్టేందుకు పల్లెలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి సమయానికి పెట్టుబడి సాయం అందకపోవడం, వేసిన పంటలు నీళ్లులేక ఎండిపోవడం, విద్యుత్తు సరఫరాలోపంతో బోర్ల కింద సాగు చేసిన పంటలు కూడా ఎండిపోయే దశకు చేరడంతో రైతులు కుంగిపోతున్నారు. ఫలితంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతాంగం పొట్టకూటి కోసం వలస పట్టే పరిస్థితి వస్తున్నదని చెప్తున్నారు.
ఉపసర్పచ్ సైతం వలసబాట
గంగిమాన్ దొడ్డి నుంచి వలస వెళ్లినవారిలో ఆ గ్రామ ఉప సర్పంచ్ కూడా ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వేసిన పంట చేతికి రాకపోవడంతో ఉప సర్పంచ్ కర్రెప్ప అప్పులపాలయ్యారు. కుటుంబ పోషణ కోసం పత్తి ఏరడానికి జడ్చర్ల నియోజకవర్గానికి వలస వెళ్లారు. ఇన్నాళ్లుగా సొంతూర్లో రైతుగా, దర్జాగా బతికిన కరెప్ప, ఇప్పుడు ఊరుగాని ఊరుకు వెళ్లి పంట పొలాల్లో కూలిగా మారిపోయారు. కిలో పత్తి ఏరితే రూ.12 ఇస్తున్నారని, రోజూ 50 నుంచి 70 కిలోల వరకు పత్తి సేకరిస్తున్నామని ఆయన చెప్పారు.
సర్పంచ్‌ది కూడా దాదాపు ఇదే పరిస్థితి. కాంగ్రెస్ మద్దతుదారైన లైనా పద్మ సర్పంచ్‌గా గెలిచారు. ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం నుంచి నయా పైసా కూడా రాలేదు. దీంతో సుమారు రూ.ఆరు లక్షల వరకు సొంత డబ్బు ఖర్చుపెట్టి పనులు చేయించారు. ఇప్పుడు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. నేతల చుట్టూ తిరిగినా, ఒక్క బిల్లు కూడా మంజూరు కాకపోవడంతో సర్పంచ్ కుటుంబం అప్పులపాలయ్యింది. కుటుంబ పోషణ కోసం తాను కూడా వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నదని సర్పంచ్ కొడుకు ఊరకుంద ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో వాపోయారు.
ఉపాధి కోసం ఊరు వదిలి..
గట్టు మండలం గంగిమాన్ దొడ్డి గ్రామాన్ని నమస్తే తెలంగాణ బృందం సందర్శించింది. అక్కడి పరిస్థితులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముంచుకొస్తున్న ముప్పునకు సజీవ సాక్ష్యంగా నిలిచాయి. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న గంగిమాన్ దొడ్డిలో ఇండ్ల సంఖ్య 156. జనాభా 690. గ్రామంలోని రైతులు వరి, పత్తి ఎక్కువగా పండించారు. వర్షాభావ పరిస్థితులు, కరెంటు కోతలతో సాగునీరు అందక పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఇప్పటికే పత్తి మొత్తం నాశనమైందని రైతులు వాపోతున్నారు.
గతంలో ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని, ఇప్పుడు క్వింటా కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పంటది కూడా ఇదే పరిస్థితి. ఒక్కో ఎకరాకు రూ.15 వేల నుంచి 30 వేల వరకు నష్టపోయామని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. గతంలో లాభాలు చూశామని, ఈసారి పెట్టుబడి కూడా పోయి అప్పులు మిగిలాయని ఘొల్లుమంటున్నారు. పంటలు ఎండిపోయి, గ్రామంలో పనులు లేకపోవడంతో కుటుంబం గడవడానికి, అప్పులు తీర్చడానికి గ్రామస్థులు మళ్లీ వలసబాట పట్టారు. సుమారు 200 మంది వరకు పత్తి, మిరప ఏరడానికి కూలీలుగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని స్థానికులు చెప్తున్నారు. కూలీ డబ్బులను గ్రామంలోని వృద్ధుల, పిల్లల పోషణ కోసం పంపుతున్నారని వెల్లడించారు.
ఇంత ఘోర పరిస్థితి చూడలేదు
మా ఊర్ల ఉపాధి దొరకక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. కరెంట్ సక్రమంగా లేక, సాగునీళ్లు ఇవ్వకపోవడంతో ఊర్లో పంటలు ఎండిపోయాయి. ఇంత ఘోరమైన పరిస్థితి ఎన్నడూ చూడలేదు. పెట్టుబడి కోసం చేసిన అప్పును తీర్చడానికి, పొట్ట తిప్పల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ప్రస్తుతం పత్తి తీయడానికి వలస వెళ్లారు. అక్కడ సీజన్ అయిపోయిన తర్వాత తిరిగి ఊరికి వస్తారు. ఆ తర్వాత మళ్లీ ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకుంటారు. ఇలానే ఉంటే రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. – తిమ్మప్ప, గంగిమాన్‌దొడ్డి
నీళ్లున్నా కరెంట్ లేదు
మాకు కొద్దిపాటి వ్యవసాయం ఉన్నది. అందులో సీడ్ పత్తి సాగు చేశా. బోరు ఉంది, నీళ్లున్నాయి. కానీ విద్యుత్తు సరఫరా సక్రమంగా లేకపోవడంతో వేసిన పంట ఎండిపోయే స్థితికి చేరింది. పనులు లేక ఇప్పటికే ఊర్లో చాలా మంది వలస వెళ్లారు. పత్తి తీయడం, ఇటుక బట్టీల్లో పని చేస్తున్నారు. పంటకోసం చేసిన అప్పులు తీర్చడానికి నేను కూడా వలస వెళ్లాలని నిర్ణయించుకున్నా. బీఆర్ఎస్ పాలనలో నీళ్లు పుష్కలంగా ఉండేవి. కరంటు ఎప్పుడూ ఉంటుండే. పొలానికి ఎప్పుడు వెళ్లినా నీళ్లు పారించుకునే వాళ్లం. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కరెంట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి.
– ఉరుకుందు, గంగిమాన్‌దొడ్డి
ఉప సర్పంచ్ అయినా వలస తప్పలేదు
నేను మా ఊరి ఉప సర్పంచ్‌ను. ఖరీఫ్‌లో వర్షాభావానికితోడు అరకొర విద్యుత్తు సరఫరాతో వేసిన పంటలన్నీ ఎండిపోయాయి. ఊర్లో ఉపాధి కరువైంది. దీంతో కుటుంబంతో సహా వలస తప్పలేదు. జడ్చర్ల సమీపంలోని డోనూర్కు పత్తి తీయడానికి వెళ్లాం. ఉపసర్పంచ్ అయినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. సర్పంచ్‌కే బిల్లులు రావడంలేదు. నన్నెవ్వరు పట్టించుకుంటారు? ఇటీవలే ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నాను. నిర్మాణం పూర్తయిన తర్వాతే చివరి బిల్లు ఇస్తామంటున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. వలస వెళ్తే కుటుంబ పోషణతోపాటు కొంత సొమ్ము చేతిలో ఉంటుందని ఆశపడుతున్నాం.
– బోయ కర్రెప్ప, ఉప సర్పంచ్, గంగిమాన్‌దొడ్డి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

