ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవడం కోసం భారత ప్రభుత్వం అమెరికాకు చెందిన లాబీయింగ్ సంస్థలకు భారీ మొత్తంలో చెల్లింపులు జరిపినట్టు తాజాగా వెల్లడైంది.
- లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
- ప్రధాని మోదీని డొనాల్డ్ ట్రంప్ అభినందించడానికీ చెల్లింపులే!
- ఒక సంస్థతో నెలకు రూ.70.50 లక్షల కాంట్రాక్ట్
- మరో సంస్థకు నెలకు రూ.1.26 కోట్లు చెల్లింపు
న్యూఢిల్లీ, నవంబర్ 7: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవడం కోసం భారత ప్రభుత్వం అమెరికాకు చెందిన లాబీయింగ్ సంస్థలకు భారీ మొత్తంలో చెల్లింపులు జరిపినట్టు తాజాగా వెల్లడైంది. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా గుర్తింపు పొందిన సందర్భంగా ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో చేసిన అభినందన పోస్టును కూడా ఓ లాబీయింగ్ సంస్థనే ఏర్పాటు చేసినట్టు అమెరికా అధికారిక పత్రాల ద్వారా వెలుగులోకి వచ్చింది. అమెరికా విదేశీ ఏజెంట్ల నమోదు చట్టం (ఎఫ్ఏఆర్ఏ) కింద సమర్పించిన పత్రాల్లో ‘మెర్క్యురీ పబ్లిక్ అఫైర్స్’ అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ పరిణామం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజాధనం చెల్లించి పొందిన ఆ అభినందనను తమ నేతకు దక్కిన ఘనతగా బీజేపీ శ్రేణులు అప్పట్లో గొప్పగా ప్రచారం చేసుకున్నాయి.
నెలకు 75 వేల డాలర్లకు మెర్క్యురీతో ఒప్పందం
ట్రంప్ మెప్పును లేదా అభినందనలను పొందేందుకు ఆయనకు అత్యంత సన్నిహితులుగా భావించే వ్యక్తుల నేతృత్వంలో పనిచేస్తున్న మెర్క్యురీ పబ్లిక్ అఫైర్స్ సంస్థతో భారత ప్రభుత్వం నెలకు 75 వేల డాలర్ల (సుమారు రూ.70.50 లక్షలు) చెల్లింపుతో ఒప్పందం కుదుర్చుకుంది. ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఈ ఒప్పందం జరిగింది. ట్రంప్ బృందంలోని కమ్యూనికేషన్స్ డైరెక్టర్ బ్రయాన్ లాంజా ఈ సంస్థలో కీలకంగా ఉన్నారు. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు చెందిన దివ్య కథనం ప్రకారం.. మెర్క్యురీ తన నివేదికలో ట్రంప్ జూన్‌లో ఎక్స్ వేదికపై చేసిన పోస్టును కూడా ప్రస్తావించింది. భారత ప్రధానిగా అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తిగా మోదీ గుర్తింపు పొందిన సందర్భంగా ట్రంప్ ఆయనకు అభినందనలు తెలుపుతూ ఆ పోస్టు చేశారు.
మరో సంస్థకు నెలకు రూ.1.26 కోట్ల చెల్లింపు
ట్రంప్‌కు సన్నిహితుడైన జేసన్ మిల్లర్ నేతృత్వంలోని మరో సంస్థ ఎస్‌హెచ్‌డబ్ల్యూ పార్ట్నర్స్ ఎల్ఎల్సీ’కి కూడా భారత ప్రభుత్వం భారీ మొత్తంలో చెల్లింపులు జరిపినట్టు వెల్లడైంది. ఈ సంస్థతో భారత ప్రభుత్వం 2025 ఏప్రిల్‌లో ఒప్పందం కుదుర్చుకుంది. నెలకు 1.5 లక్షల డాలర్లు (సుమారు రూ.1.41 కోట్లు) చెల్లించేలా వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మరో ఏడాది పాటు ఒప్పందాన్ని పొడిగించారు. అయితే జేసన్ మిల్లర్ ట్రంప్ ప్రభుత్వంలో ప్రత్యేక ఉద్యోగిగా చేరడంతో జూన్ 23న ఈ ఒప్పందాన్ని రద్దు చేశారు. ఈ సంస్థకు అప్పగించిన బాధ్యతల్లో అమెరికా ప్రభుత్వ విధానాలపై వ్యూహాత్మక సలహాలు, కార్యాచరణ ప్రణాళికలు, అమెరికా ప్రభుత్వం, చట్టసభ, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, థింక్‌ట్యాంకులు, ఇతర కీలక వర్గాలతో సంబంధాల నిర్వహణకు సహకారం అందించడం ఉన్నాయి. ఈ సంస్థ మే, జూన్ నెలల్లో భారత ప్రభుత్వ ప్రతినిధులకు, వైట్‌హౌస్ ఉన్నతాధికారులకు మధ్య ఎనిమిది ఫోన్ సంభాషణలను తాము ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది.
నెలకు రూ.2.11 కోట్లు ఖర్చు చేసి సాధించిందేమిటి?
భారత ప్రభుత్వం అమెరికా లాబీయింగ్ సంస్థలకు నెలకు మొత్తం 2.25 లక్షల డాలర్లు (సుమారు రూ.2.11 కోట్లు) చెల్లించడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికాలో భారత ప్రయోజనాలను కాపాడేందుకు, రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు లాబీయింగ్ సంస్థల సేవలను వినియోగించుకోవడం ఒక అంశమైతే, అందుకు ప్రజాధనాన్ని భారీగా ఖర్చు చేయడం ద్వారా దేశానికి లభించిన ప్రయోజనాలేమిటన్నది చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ నుంచి మోదీకి వచ్చిన అభినందన పోస్టును అప్పట్లో బీజేపీ అనుకూల వర్గాలు అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు లభించిన గొప్ప గుర్తింపుగా ప్రచారం చేశాయి. అయితే ఇప్పుడు ఆ పోస్టు వెనుక లాబీయింగ్ సంస్థ పాత్ర ఉన్నట్టు వెల్లడికావడం రాజకీయ విమర్శలకు దారితీస్తున్నది. మోదీని ట్రంప్ అభినందించడానికి చెల్లింపు ఆధారిత లాబీయింగ్ సేవల అవసరం ఏమిటి? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

