వాషింగ్టన్, మే 7: అనేక ఏండ్లుగా కంపెనీలో సేవలందిస్తున్న వేలాది మంది సీనియర్ ఉద్యోగులు స్వచ్ఛందంగా సంస్థను విడిచిపెట్టడానికి టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ పలు ఆకర్షణీయమైన ప్యాకేజీలను ప్రకటించింది. ఇందులో ఆరోగ్య సంరక్షణ కవరేజీ, నగదు చెల్లింపులు, స్టాక్ ప్రయోజనాలను ఇవ్వనున్నట్టు తెలిపింది. మైక్రోసాఫ్ట్ 50 ఏండ్ల చరిత్రలో ఇలా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం (వీఆర్ఎస్)ను ప్రకటించడం ఇదే తొలిసారి.
ఈ పథకానికి సంబంధించిన ప్రణాళికను సంస్థ గత నెలలోనే ప్రకటించినప్పటికీ పూర్తి వివరాలు తెలియజేయలేదు. ఇప్పుడు కంపెనీ అంతర్గత హెచ్ఆర్ పోర్టల్‌లో పూర్తి వివరాలను ఉంచింది. దీని ప్రకారం 50 ఏండ్ల వయసుండి మైక్రోసాఫ్ట్‌లో 20 ఏండ్ల సర్వీస్ ఉన్నవారికి ఈ పథకాన్ని వర్తింప చేస్తారు.
55 ఏండ్లు ఉండి సంస్థలో 15 ఏండ్ల అనుభవం ఉన్న వారు కూడా దీనికి అర్హులే. సంస్థను విడిచి వెళ్లేవారికి లభించే అతిపెద్ద లాభం హెల్త్‌కేర్ ప్రయోజనం. సంస్థను విడిచి వెళ్లిన ఐదేండ్ల వరకు దాని సేవలు పొందవచ్చు. ఏకమొత్తంలో ఉద్యోగ విరమణ ప్యాకేజీ ఇస్తారు.