న్యూఢిల్లీ, మే 7: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. ఎంపిక చేసిన రుణాలపై ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్)ను స్వల్పంగా తగ్గించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో నెల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 8.10 శాతం నుంచి 8.05 శాతానికి దిగిరానుండగా, మూడు నెలల రుణాలపై రేటు 8.20 శాతం నుంచి 8.15 శాతానికి, ఆరు నెలల రుణాలపై వడ్డీరేటును 8.35 శాతం నుంచి 8.30 శాతానికి దించింది. మరోవైపు, ఏడాది, రెండేండ్ల కాలపరిమితితో కూడిన రుణాలపై వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. కానీ, మూడేండ్ల కాలపరిమితితో కూడిన రుణాలపై వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లు సవరించడంతో రుణ రేటు 8.55 శాతం నుంచి 8.60 శాతానికి చేరుకున్నది. ఈ నూతన రేట్లు గురువారం నుంచి అమలులోకి వచ్చాయి.
డిపాజిట్లర్లకు బ్యాంక్ గుడ్‌న్యూస్‌ను అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ప్రస్తుతం డిపాజిట్లపై 2.75 శాతం నుంచి 6.50 శాతం లోపు వడ్డీని ఆఫర్ చేస్తుండగా, సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం నుంచి 7 శాతం లోపు ఆఫర్ చేస్తున్నది. వీటితోపాటు మూడేండ్ల నుంచి 4 ఏండ్లు 7 నెలల లోపు టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు సవరించడంతో వడ్డీరేటు 6.40 శాతం నుంచి 6.50 శాతానికి చేరుకున్నది.