తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ తరపున పాలక్కడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ‘మెట్రో మ్యాన్’ ఈ శ్రీధరన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ శ్రీధరన్ బీజేపీ సీఎం అభ్యర్థి అని ప్రచారం జరిగింది. ఇక ఆయన సీఎం అయితే పాలన అద్భుతంగా ఉంటుందని నటుడు మోహన్ లాల్ అన్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఈ శ్రీధరన్ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తాను భారీ మెజార్టీతో గెలువబోతున్నాని విశ్వాసం వ్యక్తం చేశారు. తాను బీజేపీలో చేరడం పార్టీలో భిన్నమైన మార్పును తీసుకొచ్చింది. కేరళలో బీజేపీ అసాధారణమైన విజయం సాధిస్తుందన్నారు. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని ఈ శ్రీధరన్ చెప్పారు.
కేరళలోని 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 957 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2.74 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.