సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ)/అమీర్పేట్ : హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ప్రయాణికులకు ఉగాది ఆఫర్ను ప్రకటించింది. సెలవు దినాల్లో కేవలం రూ.59కే రోజంతా ప్రయాణించే అవకాశం కల్పించింది. గురువారం ఈ విషయాన్ని ఎల్అండ్టీ హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కేవీబీ రెడ్డి వెల్లడించారు. అమీర్పేట మెట్రో స్టేషన్ ప్రాంగణంలో ప్రయాణికులు, మెట్రో అధికారుల సమక్షంలో ‘సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు’ను ఆయన విడుదల చేశారు. ఈ హాలిడే కార్డులు ఉగాది సందర్భంగా శనివారం నుంచి అన్ని మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. రూ.59 చెల్లించడం ద్వారా సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డును పొందవచ్చని చెప్పారు. ప్రతి ఆదివారం, నెలలో రెండో, నాలుగో శనివారాలు సాధారణంగా సెలవు దినాలుగా పరిగణిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2022-23 సెలవు దినాలకు సంబంధించి హెచ్ఎంఆర్ఎల్ క్యాలెండర్ను విడుదల చేసింది.
ప్రయాణికులకు బహుమతులు
ప్రయాణికులను మరింత ప్రోత్సహించేందుకు ప్రతి నెలా లక్కీ డ్రా ద్వారా ఐదుగురు ప్రయాణికులను ఎంపిక చేసి, బహుమతులను అందజేస్తున్నామని కేవీబీ రెడ్డి తెలిపారు. గురువారం లక్కీడ్రాలో ఎంపికైన సతీశ్ రోజీ, ప్రమీత్, గాయత్రి, టీఎస్ఎన్ మూర్తికి బహుమతులు ప్రదానం చేశామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎల్ అండ్ టీ, మెట్రోరైల్ అధికారులు సుధీర్, పీ రవిశంకర్, ఎస్ఈ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.