అమరావతి : ఏపీ ప్రజలకు వాతావరణశాఖ గుడ్న్యూస్ (Good News ) తెలిపింది. గత కొన్ని రోజులుగా వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం క్రమంగా బలహీనపడుతుందని వాతావరణశాఖ అధికారులు (Meteorological department) చల్లని కబురు అందించారు.
వాయుగుండం ఈశాన్యదిశగా కదులుతుందని దీంతో వర్షాలు (Rains) తగ్గుముఖం పడుతాయని స్పష్టం చేశారు. అయితే ఉత్తరకోస్తా జిల్లాల్లో చెదురు ముదురుగా వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలం కారణంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్ల వద్దని సూచించారు.
పోర్టులకు మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని వివరించారు. కాగా గత మూడు రోజులుగా శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో కురిసిన వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) శనివారం సమీక్ష నిర్వహించి కలెక్టర్లు , జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలు, అప్రమత్తతపై పలు సూచనలు చేశారు. వర్షాల వల్ల జరిగిన పంటనష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.