Arrested | వినాయకనగర్, జనవరి 12 : నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు బంగారు షాపులలో దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా కు చెందిన సభ్యులను అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య వెల్లడించారు. కమిషనరేట్ లోని కమాండ్ కంట్రోల్ హాల్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన దోపిడీ ముఠాకు చెందిన సభ్యుల వివరాలను వెల్లడించారు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రికి చెందిన లక్ష్మణ్ సింగ్ భావూరి , ప్రేమ్ సింగ్ ధరం సింగ్ కిచ్చి, సాగర్ సింగ్, మహమ్మద్ షేక్ నలుగురు ముఠా సభ్యులు డిసెంబర్ 21న అర్ధరాత్రి అనంతరం నిజామాబాద్ జిల్లా పరిధిలో బైక్ లు దొంగిలించుకొని బోధన్ పట్టణానికి చేరుకున్నట్లు తెలిపారు. అనంతరం వారు బోధన్ పట్టణంలో రెండు బంగారు షాపుల షట్టర్ రన్ ధ్వంసం చేసి అందులోంచి 35 తులాల బంగారు నగలు, 14 కిలోల వెండిని దొంగిలించుకొని ఇక్కడి నుండి పరారయ్యారు.
ఈ దోపిడీ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐ వెంకటనారాయణ బృందం దోపిడీ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీపీ తెలిపారు. ఆదివారం రాత్రి బోధన్ బైపాస్ ఆచంపల్లి వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పోలీసులను చూసి నలుగురు వ్యక్తులు పరాలైనట్లు తెలిపారు. పోలీసులు వెంబడించి దోపిడి ముఠా లోని లక్ష్మణ్ సింగ్, ప్రేమ్ సింగ్ దారం సింగరే ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వివరించారు.
కాగా వారి వద్ద నుండి 14 తులాల బంగారు, 6 కిలోల వెండి వస్తువులు చోరీ సొత్తులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ముఠా దొంగిలించిన సొత్తులు మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన నయీమ్ నదీమ్ సయ్యద్, లక్ష్మీకాంత్ సంతోష్ టాక్ మొత్తం ఆరుగురుపై కేసు నమోదు చేసినట్లు సీపీ వెల్లడించారు. పోలీసులకు పట్టుబడిన ఇద్దరు నిందితులతో పాటు చోరీ సొత్తు కొన్న మరో ఇద్దరినీ రిమాండ్ కు తరలించామని, ఈ దోపిడీ ముఠాలు పట్టుకునేందుకు కృషిచేసిన బోధన్ ఎసిపి శ్రీనివాస్, బోధన్ నగర సీఐ వెంకటనారాయణ, ఎస్ఐ మనోజ్ కుమార్, ఏ ఎస్ ఐ బాబురావు, సిబ్బంది రవి, మహేష్, సాయికుమార్, అశోక్ లను ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అభినందించారు.