Chiranjeevi | కేరళ వయనాడ్ విపత్తుల్లో దాదాపు 400మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వందలాది మంది గల్లంతయ్యారు. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. విపత్తులో బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే ఎంతో మంది ముందుకు వచ్చి సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ నటుడు మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రామ్ చరణ్ రూ.కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చిరంజీవి గురువారం ప్రత్యేక విమానంలో కేరళకు వెళ్లారు. సీఎం పినరయి విజయన్ను కలిశారు. రూ.కోటి విరాళం చెక్‌ను సీఎంకు అందించారు.
వయనాడ్ విపత్తు, సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ ప్రకృతి విపత్తు సమయంలో అందరూ కేరళకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవికి విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా.. కేరళ సీఎం సహాయ నిధికి ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రూ.2 కోట్లు, అల్లు అర్జున్ రూ.25 లక్షలు, నయనతార రూ.20 లక్షలు, హీరో విక్రమ్రూ.20 లక్షలు, హీరో సూర్య-కార్తీ సోదరులు రూ.50లక్షలు, మమ్ముట్టి దుల్కర్ సల్మాన్ కలిసి రూ.35 లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు, రష్మిక మందన్న రూ.10లక్షల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.