హైదరాబాద్/వ్యవసాయ యూనివర్సిటీ, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : భారత వ్యవసాయ రంగంలో మహిళల వాటా దాదాపు 58 శాతంగా ఉన్నదని, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ (పీజేటీఏయూ) బోధనా సిబ్బందిలో 50% మంది మ హిళలు ఉన్నారని, వ్యవసాయ విద్యనభ్యసించే విద్యార్థుల్లో 70% మంది అమ్మాయిలేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌లోని పీజేటీఏయూ క్రీడాప్రాంగణంలో రెండు రోజులపాటు జరుగనున్న మెగా రైతుమేళా ఆదివారం ప్రారంభమైంది. పీజేటీఏయూ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈ మేళా నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాదిని అంతర్జాతీ య మహిళా రైతు సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నేపథ్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా మేళాను ఏర్పాటు చేశా రు. రాష్ట్రం నలుమూలనుంచి పెద్ద సంఖ్యలో రైతులు, మహిళా రైతులు, వ్యవసాయరంగ నిపుణులు, వ్యవసాయ విద్యార్థులు హాజరయ్యారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. వ్యవసాయం, రైతాంగ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు 500 కోట్లు కేటాయించిందని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో మహిళా రైతులకు పెద్ద పీటవేస్తున్నామని, భవిష్యత్తులో మహిళలకే డ్రోన్లు అందిస్తామని తెలిపారు. కొత్త వంగడాలు, సాంకేతికతలను అందుబాటులో కి తీసుకురావడం ద్వారా అగ్రి వర్సిటీ రైతులకు సేవ చేస్తున్నదని మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసించారు. మెగా రైతు మేళా నిర్వహిస్తున్నందుకు జయశంకర్ యూనివర్సిటీని, రైతులకు ఉపయోగపడే స్టాళ్లను ఏర్పాటు చేసిన నిర్వాహకులను మంత్రి సీతక అభినందించారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నప్పటికీ వారికి తగ్గ గౌరవం దకడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో భారత వ్యవసాయ పరిశోధనా మండలి డైరక్టర్ జనరల్ ఎంఎల్ జాట్, పీజేటీఏయూ వీసీ అల్దాస్ జానయ్య, వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి, ఉద్యాన శాఖ సంచాలకులు యాస్మీన్ బాషా, శాసనమండలి విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పాల్గొన్నారు.