శివ్వంపేట, మే 25: ఇసుక దిబ్బ కూలి, ఇద్దరు కూలీలు మృతిచెందిన ఘటన శివ్వంపేట మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లపల్లి గ్రామానికి చెందిన తలారి ఆంజనేయులు కొద్ది రోజులుగా ఇసుకను ఫిల్టర్ చేసి అక్రమంగా రవాణా చేస్తున్నాడు. తలారి ఆంజనేయులు వద్ద ఇసుక తీయడానికి గుండ్లపల్లి గ్రామ శివారులోని దుబ్బలమాకు వద్దకు ఇందూరు అశోక్ (27), మస్కురి మహేశ్(21) పనికోసం వెళ్లారు. వీరు ఇసుకను ట్రాక్టర్లో నింపేవారు.
బుధవారం వీరిద్దరు ఇసుక తీస్తున్న క్రమంలో ఇసుక దిబ్బ కూలింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇది తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని జేసీబీ సహాయంతో వీరి మృతదేహాలు వెలికితీశారు. విషయం తెలుసుకున్న శివ్వంపేట ఎస్సై రవికాంతరావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడు ఇందూరు అశోక్‌కు మూడేండ్ల కొడుకు, భార్య ఉంది. మాస్కురి మహేశ్ అవివాహితుడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.