మెదక్ మున్సిపాలిటీ, మార్చి 30 : తెలంగాణలో యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జడ్పీ చైర్పర్సన్ హేమలతశేఖర్‌గౌడ్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా ప్రజాపరిషత్ ప్రత్యేక సాధారణ సర్వసభ్య సమావేశం బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భం గా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి ప్రవేశపెట్టిన తీర్మాణానికి గౌరవ సభ్యులు, ఎంపీపీలు చేతులెత్తి బలపరుస్తూ మద్దతు తెలిపి ఏకగ్రీవ తీర్మానానికి ఆమోదం తెలిపారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ పంజాబ్, హర్యా నాలో కేంద్రం ఏ విధంగా ధాన్యం కొనుగోలు చేస్తుందో తెలంగాణలో పండించిన ధాన్యాన్ని సైతం కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేస్తూ చేయూతనిస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం రైతుల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణని ఆవలంబించడమే కాకుండా తెలంగాణ రైతులను చిన్నచూపు చూస్తోందన్నారు. రైతులు పండించిన ధాన్యం కేంద్రం తప్పనిసరిగా కొనుగోలు చేయాలన్నారు. రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పని చేస్తామన్నారు. కేంద్రం రైతులకు ఇబ్బందులు కలిగించే ఏ నిర్ణయం తీసుకున్న దానిని వ్యతిరేకిస్తామన్నారు. రైతులకు నూకలు తినడం అలవాటు చేయాలని మాట్లాడిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను వెంటనే కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించాలని ఆమె డిమాం డ్ చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జడ్పీ సీఈవో వెంకట శైలేశ్, గౌరవ జడ్పీటీసీ సభ్యులు ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.