మెదక్ మున్సిపాలిటీ, మార్చి 14: ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన కోసం ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. సోమవారం ఆంగ్ల విద్యాబోధనపై ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాన్ని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, డైరెక్టర్ దేవసేన, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.7413 కోట్లతో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
విద్యాశాఖలో ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేసి అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. 2022-23 విద్యాసంవత్సరంలో 1వ నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయాలని సబ్ కమిటీ నిర్ణయించిందని మంత్రి వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులకు హాజరై నైపుణ్యం పెంపొందించుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ‘మన ఊరు-మన బడి’కి ఎంపికైన పాఠశాలల్లో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు తయారు చేయాలని, పరిపాలనా అనుమతులు జారీ చేసిన పనులను ప్రారంభించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలో 923 పాఠశాలల్లో…
వచ్చే విద్యాసంవత్సరం నుంచి మెదక్ జిల్లాలో 923 పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధించే విధంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు మెదక్ కలెక్టర్ హరీశ్ మంత్రికి వివరించారు. జిల్లాలో ఎంపిక చేసిన 70 మంది ఉపాధ్యాయులకు చిన్నశంకరంపేట మోడల్ స్కూల్లో నాలుగు రోజుల పాటు మొదటి విడుతగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు జిల్లాలోని అన్ని మండలాల్లో మిగతా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారన్నారు.
అంకితభావంతో పని చేయాలి
చిన్నశంకరంపేట, మార్చి14 : ఆంగ్ల బోధనపై శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. సోమవారం చిన్నశంకరంపేటలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆంగ్లబోధనపై శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఆన్లైన్లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఉపాధ్యాయులకు అందించిన సందేశాన్ని తిలకించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.