రైతుకు దన్ను.. చేనేతకు వెన్నుదన్ను.. సొంత జాగాలో ఇంటి నిర్మాణానికి సాయం.. వయసు అర్హత తగ్గింపుతో మరింత మందికి ఆసరా పింఛన్లు. పంట రుణాల మాఫీతో అన్నదాతకు అప్పుల నుంచి విముక్తి. వ్యవసాయం, సాగునీటి, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేస్తూ.. కలలో సైతం ఊహించని విధంగా దళితబంధుకు భారీగా నిధులు కేటాయిస్తూ… సర్కారు బడిని సమున్నతంగా నిలిపేం దుకు ‘మనఊరు-మనబడికి’ దండిగా నిధులు పొందుపరుస్త్తూ.. ఇలా అన్నివర్గాలకు మేలు చేసేలా 2022-2023 ఆర్థిక సంవత్సరా నికి రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో సోమవారం ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. మెదక్‌కు మెడికల్ కళాశాలను ప్రకటించింది.
సిద్దిపేట జిల్లా ములుగులో అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రూ.100 కోట్లు కేటాయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని జలాశయాల వద్ద టూరిజం అభివృద్ధికి రూ.1500 కోట్లు కేటాయించడం మన ప్రాంత పర్యాటక అభివృద్ధికి దోహద పడనున్నది. చేనేత కార్మికులకు చేయూతతో దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న నేతన్నలకు లబ్ధి జరుగనున్నది. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతలు, నల్లవాగు, సింగూరు ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్యాకేజీ పనుల పూర్తికి నిధులు కేటాయించడంతో పనులు పరుగెత్తనున్నాయి. పామాయిల్‌కు ప్రోత్సాహం ప్రకటించడంతో మరింత మంది సాగుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
సిద్దిపేట, మార్చి 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై అన్నివర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సంక్షేమానికి, వ్యవసాయానికి, సాగునీటి రంగాలకు పెద్దపీట వేసింది. కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లను మంచి టూరిజం హబ్‌లుగా తీర్చిదిద్దేందుకు భారీగా నిధులు కేటాయించింది. సిద్దిపేట జిల్లా ములుగులో పారెస్ట్ కళాశాలలో కొత్తగా అటవీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు బడ్జెట్లో రూ. 100 కోట్లు కేటాయిస్తూ ప్రతిపాదించింది. మెదక్‌లో 2023 ఆర్థిక సంవత్సరంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడానికి బడ్జెట్లో నిధులు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళితబంధు పథకానికి భారీగా నిధులు కేటాయించడంతో ఆ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే తొలివిడతలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 1156 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ‘మనఊరు- మన బడి’ ద్వారా ఉమ్మడి జిల్లాలో తొలివిడతలో 1097 పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. రైతులకు రూ.75వేలలోపు రుణమాఫీ, సొంతింటి జాగా ఉండి, ఇల్లు కట్టుకునే వారికి రూ 3 లక్షల ఆర్ధిక సాయం ప్రభుత్వం చేయనున్నది. 57 ఏండ్లు నిండిన వారికి ఆసరా పింఛన్ ఇవ్వడానికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు.గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక నిధులు, రోడ్ల అభివృద్ధికి, షాదీముబారక్, కల్యాణలక్ష్మి, గొల్లకుర్మలకు మరింత ఆర్థికంగా ఎదగడానికి గొర్రెల పంపిణీ, సంక్షేమ రంగంలో ఆసరా తదితర పథకాలకు పెద్ద ఎత్తున బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించింది.
తొలి విడతలో 1156 మంది లబ్ధిదారులు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో దళితబంధు పథకం తొలి విడతలో నియోజకవర్గానికి 100 మంది చొప్పున 1156 మంది లబ్ధ్దిదారులను ఎంపిక చేశారు. ఇందుకు రూ.115 కోట్లు అవసరమవుతున్నాయి. ప్రస్తుతం యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. దళిత బందు పథకానికి బ్యాంకు లికేజీ లేదు. పూర్తి మొత్తం ప్రభుత్వమే గ్రాంట్ డబ్బులు అందజేస్తున్నది. లబ్ధిదారులు తమకు నచ్చిన యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చు. లబ్ధిదారుల మేలుకోరి ప్రభు త్వం దళిత రక్షణనిధి సైతం ఏర్పాటు చేసింది.
‘మనఊరు- మన బడి’కి 1097 పాఠశాలలు ..
రాష్ట్ర ప్రభుత్వం ‘మనఊరు- మనబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మంగా అమలు చేస్తున్నది. దీంట్లో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల విద్యను ప్రవేశపెడుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలివిడతలో 1097పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో సిద్దిపేట జిల్లాలో 343, మెదక్ జిల్లాలో 313, సంగారెడ్డి జిల్లాలో 441 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఇందుకోసం బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో 12 రకాల పనులు చేపడతారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తారు.
వ్యవసాయ రంగానికి పెద్దపీట..
వ్యవసాయ రంగానికి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. రైతుబంధు పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో 59,84,281 మంది రైతులకు రూ. 6,154.25 కోట్లు నేరుగా రైతు ల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. సిద్దిపేట జిల్లాలో 20,08,784 మంది రైతులకు రూ.2168.41 కోట్లు, మెదక్ జిల్లాలో 17,26,509 రైతులకు రూ.1450.02కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 21,76,988 లక్షల మంది రైతులకు రూ.2535.82 కోట్లును ఎనిమిది విడతలుగా ప్రభుత్వం అందించిం ది. రూ. 5 లక్షలతో రైతుబీమా పథకం అమలు చేస్తున్నది. ఇప్పటి వరకు రూ. 50 వేల వరకు పంటరుణ మాఫీ చేయగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.75 వేలకు మాఫీ చేస్తామని బడ్జెట్ నిధులు కేటాయించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నది.దీనికిగాను రాయితీలు ఇస్తున్నది. ఈ బడ్జెట్లో రూ. 1000 కోట్లు కేటాయించింది. సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు 3200 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుచేశారు. జిల్లాలో 50 వేల ఎకరాల్లో సాగు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.
మెదక్‌కు మెడికల్ కళాశాల..
ప్రతి జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కళాశాలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. తొలి విడతలోనే జిల్లా ఏర్పాటు కాగానే సిద్దిపేటలో మెడికల్ కళాశాల ఏర్పాటైంది. సీఎం కేసీఆర్ ప్రారంభించగా, బోధన విజయవంతంగా కొనసాగుతున్నది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల మంజూరు చేశారు. ఆ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక్కడ వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో మెదక్ జిల్లాకేంద్రంలో మెడికల్ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. దీనికోసం బడ్జెట్లో నిధులకు ప్రభుత్వం ప్రతిపాదించింది.
సొంత జాగా ఉంటే రూ. 3లక్షల సాయం..
డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తున్నది. ఇందుకోసం బడ్జెట్లో నిధులు కేటాయించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇచ్చింది. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇల్లు కుట్టకుందామనుకునే వారికి సొంత జాగా ఉంటే వారికి ప్రభుత్వం రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందించనున్నది. ప్రతి నియోజకవర్గానికి 3000 ఇండ్లను కేటాయించింది.
గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యం..
గ్రామీణ,పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ప్రతినెలా నిధులు కేటాయిస్తున్నది. ఇంటింటా చెత్త సేకరణ కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్,ట్యాంకర్‌ను అందించింది. హరితహారం అమలుకు ప్రతిగ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసింది. పల్లెలు, పట్టణాలు పరిశుభ్రంగా మారాయి. డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు నిర్మించారు. పరిశుభ్రత మెరుగుపడడంతో దోమల బెడద, మలేరియా వ్యాప్తి తగ్గాయి. గతేడాది సంగారెడ్డి జిల్లా పరిషత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సశక్త్తీకరణ్ జాతీయస్థాయి అవార్డుకు ఎంపికైంది. సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలు జాతీయస్థాయిలో ఉత్తమ జీపీలుగా ఎంపికయ్యాయి.
బడ్జెట్‌పై సంబురాలు
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా నాయకులు సంబురాలు జరుపుకున్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు ఆధ్వర్యంలో సిద్దిపేటలోని మంత్రి హరీశ్‌రావు క్యాంప్ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్ పట్టణ నాయకులు, కౌన్సిలర్లు పెద్ద పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జంగింటి కనకరాజు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, కౌన్సిలర్లు నాగరాజురెడ్డి, బ్రహ్మం, బర్ల మల్లికార్జున్, సాయికుమార్, అడ్డగట్ల అంజి కావేరి,చంద్రం, నాయకులు మెయిజ్, శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, శేఖర్,శ్రీకాంత్, రఘురాం, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
నీటి పారుదల రంగానికి పెద్దపీట..
నీటి పారదల రంగానికి బడ్జెట్లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేసి నది లేని చోట రిజర్వాయర్‌ను నిర్మించి నదికే నడక నేర్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి చేసుకొని చెరువులను గోదావరి జలాలతో నింపుకుంటున్నాం. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను ఫిబ్రవరి 23న సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. గోదావరి జలాలతో కొమురవెల్లి మల్లన్న పాదాలను అభిషేకించారు. ప్రధాన కాల్వల నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 21న శంకుస్థాపన చేశారు. ఈ పథకం ద్వారా సంగారెడ్డి, అందోల్, నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో 3.90 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని ప్యాకేజీ పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. ఇందుకోసం కావాల్సిన నిధులు బడ్జెట్లో కేటాయించారు. కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూ. 1500 కోట్లు కేటాయించారు.
సంక్షేమ సర్కారు..
వృద్ధ్దులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, బొదకాలు బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు నెలనెలా ఆసరా పథకం ద్వారా ప్రభుత్వం పింఛన్లు అందిస్తున్నది. తాజాగా ఈ బడ్జెట్లో 57 ఏండ్లు నిండిన వారికి ఆసరా పింఛన్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారుగా 50 వేల మంది వరకు లబ్ధి జరుగనుంది.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లాలో 30,567, మెదక్ జిల్లాలో 22,128 మందికి ప్రభుత్వం సాయం అందించింది.
ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసింది. ప్రభుత్వ దవాఖానలోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నది. సిద్దిపేట జిల్లాలో 41,774, మెదక్ జిల్లాలో 13,942 సంగారెడ్డి జిల్లాలో (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 22 వరకు )5,463 కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు.
నేతన్నకు చేయూత పథకం కింద రైతుబీమా మాదిరిగానే 5 లక్షల బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. గీత కార్మికులు ప్రమాదవశత్తు మరణిస్తే, ఆ కుటుంబానికి రూ 5 లక్షలు ఇవ్వనున్నది.
గతంలో రూ 2 లక్షలు ఇచ్చేది. సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ కార్మికుల సంఖ్య అధికంగానే ఉంటుంది. వీరి కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకు వచ్చింది. భవన నిర్మాణ కార్మికులు వీరందరిని దృష్టిలో ఉంచుకొని సబ్సిడీపై మోటరు సైకిళ్లను అందించాలని నిర్ణయించింది.
గొల్ల కుర్మలు, యాదవులకు గొర్రెల పంపిణీకి బడ్జెట్లో నిధులు కేటాయించింది.
ఇలా అన్ని వర్గాల వారికి మేలు చేసేలా ప్రభుత్వం నిధులు కేటాయించడంతో సకల జనుల బడ్జెట్ అంటూ సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
‘ప్రజా రంజక‘ బడ్జెట్
మన రాష్ట్ర బడ్జెట్ ..దేశానికే ఆదర్శంగా మారింది. తెలంగాణ ప్రజల సంక్షేమానికి పెద్దపీటవేయడంతోపాటు విద్యా, ఉపాధి, పరిశ్రమ , టూరిజం, ఆర్టీసీ తదితర రంగాలకు ప్రాధాన్యం కల్పించింది. రాష్ట్రంలోని అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ రూపొందించారు. రూ. 2.56 లక్షల కోట్లతో ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్..అన్ని వర్గాలకు మేలు జరుగనున్నది. డబుల్ బెడ్రూం ఇండ్లకు రూ12 వేల కోట్లు కేటాయించడం గొప్ప విషయం. ఇండ్ల స్థలాలు ఉన్న వారికి ఇల్లు నిర్మించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థికసాయం అందజేయడం సంతోషకరం. చేనేతలకు చేనేత బీమా పథకానికి నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయం. మెదక్ మెడికల్ కళాశాలకు నిధులు కేటాయించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. వ్యవసాయరంగానికి 24,254 కోట్లు కేటాయించడంతో పాటు రైతుల రుణామాఫీ చేయడం శుభాపరిణామం.కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు కొనసాగించేందుకు రూ.2750 కోట్లు ,కేసీఆర్ కిట్‌కు రూ.443 కోట్లు, ఆసరా పింఛన్ల కోసం రూ.11,278 కోట్లు కేటాయించారు. రాష్ట్ర బడ్జెట్ ముమ్మాటికీ సంక్షేమ బడ్జెట్‌గా చెప్పవచ్చు. మన ఊరు- మన బడి, నిరుపేదల ఇండ్ల నిర్మాణాలకు ఆర్థికసాయం, చేనేత బీమాకు నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. కేంద్ర బడ్జెట్ ప్రజలపై భారం మోపితే…తెలంగాణ సర్కారు ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయడం చాలా సంతోషం.
-కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ
అన్ని వర్గాలకు సముచిత స్థానం..
రాష్ట్ర బడ్జెట్ సంపూర్ణంగా సంక్షేమ బడ్జెట్ అని చెప్పొచ్చు. ఇందులో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించారు. ము ఖ్యంగా సొంత స్థలం ఉన్న వారికి రూ. 3లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవ డం నిరుపేదలకు వరంలాంటిది. దళితబంధుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి వాటిని బలోపేతం చేయడం, చేనేత, గీత కార్మికులకు ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా బడ్జెట్‌కు రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావులకు కృతజ్ఞతలు.
– వొడితెల సతీశ్‌కుమార్, ఎమ్మెల్యే, హుస్నాబాద్
అందరినీ గౌరవించేలా
రాష్ట్రంలోని అందరినీ గౌరవించేలా రాష్ట్ర బడ్జెట్ ఉంది. రాష్ట్రంలో అన్ని వర్గాలను ముందుకు తీసుకువెళ్లేలా బడ్జెట్లో నిధులను కేటాయించారు. దళితబంధు, సొంతింటి నిర్మాణానికి సహాయం, విద్యవైద్యం, సంక్షేమం, అభివృద్ధి, విద్యాభివృద్ధి అన్ని రంగాల్లోనూ సముచిత న్యాయం జరిగింది. రైతులకు రుణమాఫీతో మరింత అం డగా తెలంగాణ ప్రభుత్వం నిలబడింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే సంక్షేమ ప్రభుత్వమని మరోసారి నిరూపించినట్టయ్యింది.
– వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్, గజ్వేల్
దళితబంధుకు నిధులు సంతోషకరం
రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధుకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడం సంతోషంగా ఉంది. బడ్జెట్లో పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయడం అభినందనీ యం. బడ్జెట్‌ను అన్ని రంగాల వా రికి సంతృప్తికరంగా ఉన్నది.
– మౌర్య స్వరూప, నర్సింహులపల్లి, బెజ్జంకి
చేనేత కార్మికులకు బీమా శుభ పరిణామం
చేనేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర సర్కారు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నది. వ్యవసాయ రంగం తర్వాత రెండోదైన చేనేతపై దృష్టి సారించింది. రైతుల తరహాలోనే చేనేత కార్మికులకు రూ.5 లక్షల బీమాను అందించడం నిజంగా గొప్ప విషయం. రాష్ట్రంలోని చేనేత కులస్తులందరికీ బీమాను వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నా. ఏది ఏమైనా టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే చేనేతలకు మంచిరోజులు వస్తున్నాయి.
– మర్గల సత్యానందం, నీలకంఠ సమాజం అధ్యక్షుడు, దుబ్బాక
తెలంగాణ ఆర్థికాభివృద్ధికి బడ్జెట్ తోడ్పాటు
రాష్ర్టాన్ని మరింత ఆర్థికంగా బలోపేతం చేసేలా బడ్జెట్ ఉంది. తెలంగాణ సమగ్రాభివృద్ధితో పా టు ఆర్థికాభివృద్ధికి ఈ బడ్జెట్ తో డ్పాటునందిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి సాధించాలంటే, మొ దట అన్ని శాఖలకు కేటాయింపులుంటే సాధ్యమవుతుంది. అదే తరహాలో బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. రానున్న రోజుల్లో దేశంలో పటిష్ట ఆర్థికాభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ మారడం ఖాయం.
– ఎర్రబెల్లి సుధీర్‌కుమార్, వాణిజ్యశాస్త్ర అధ్యాపకుడు, చేర్యాల
ఇల్లు కట్టుకుంటాననే ధైర్యం వచ్చింది..
మాది గుర్రాలగొంది గ్రా మం. నాకు జాగా ఉంది. ఇల్లు లేదు. ఇల్లు కడుతానో? లేదో? అని భయపడేవాడిని. బడ్జెట్లో సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. ప్రభుత్వ ప్రకటనతో కొంచెం ధైర్యం వచ్చింది. ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– శివ, గుర్రాలగొంది, నారాయణరావుపేట
సర్కారు చక్కని నిర్ణయం
బడ్జెట్లో ఆసరా పెన్షన్లను పెంచి సర్కారు చక్కని నిర్ణయం తీసుకుంది. 57ఏండ్లకే ఆసరా పింఛన్ ఇవ్వడం బాగుంది. పెన్షన్లను అందిస్తున్న తెలంగాణ సర్కారుకు అండగా ఉంటాం. బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆశాజనకంగా ఉంది.
– నాగయ్య, బూరుగుపల్లి, సిద్దిపేట
ఎంతో సంతోషంగా ఉంది
రైతులు తీసుకున్న రూ.50 వేలు పంట రుణాలను ఇప్పుడు సీఎం కేసీఆర్ మాఫీ చేస్తాననడం సంతోషంగా ఉంది. రైతులకు వ్యవసాయ రంగానికి సకల సౌకర్యాలు కల్పి స్తూ సీఎం కేసీఆర్ కంటికి రెప్పలాగా కాపాడుతున్నారు. రైతులకు రుణ మాఫీ చేయడంతో గ్రామాల్లోని అన్నదాతలు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
– చిన్నగల్ల కనుకయ్య, రైతు, మిరుదొడ్డి
రైతులకు ఆర్థికంగా తోడ్పాటు..
బ్యాంకుల్లో రైతులు పంటల కోసం తీసుకున్న రుణాలను సీఎం కేసీఆర్ విడుతల వారీగా మాఫీ చేశారు. మరో దఫాలో రూ.50వేలు మాఫీ చేయడంలో మా రైతులకు ఆర్థికంగా ఎంతో దోహదపడుతుంది. రైతుల కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను ఎప్పటికీ మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకుంటాం.
– పెద్ద మాతరి మల్లయ్య, రైతు, మిరుదొడ్డి
సార్ సల్లగుండాలే
నిజంగా ఏం లేనోళ్లకు దేవుడే దిక్కు.. ఎవరూ లేని మా అసోంటోళ్లకు సీఎం కేసీఆర్ సార్ సాయం అయితుండు. ఎవరేం చెప్పిన ముసలితనంలో కొడుకులు చేసే పనిని, గీ ముఖ్యమంత్రి సార్ చేస్తుండు. నాలాంటోళ్ల ఎంతో మంది చల్లని దివేనలు సార్‌కు ఉన్నాయి. ఈ వయస్సులో చాతగాక ఇంటి పట్లనే ఉండే నా అసోంటళ్లకు పెద్ద దిక్కువోలే నెలనెలా రూ.2016 పించిన్ ఇస్తున్న సార్ సల్లగుండాలే.
– చుంచు కిష్టమ్మ, మర్రిముచ్చాల, కొమురవెల్లి
పండుగను తలపించే..
రాష్ట్ర బడ్జెట్లో దళితబంధు అమలుకు రూ.17వేల కోట్లకు పైగా, పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకు ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు కేటాయించడం, అటు దళితులతోపాటు వెనకబడిన ప్రతీ పేదకుటుంబానికి ఎంతో మే లు చేసినట్లయ్యింది. ముఖ్యమంత్రి నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా తీసుకున్న నిర్ణయం, ప్రతీ గ్రామానికి పండుగను తలపించే సంతోషాన్నిచ్చింది. – దేవీరవీందర్, రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్
అందరి మన్ననలు పొందింది..
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరి మన్ననలు పొందింది. అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ రైతన్నకు పెద్దపీట వేశారు. ఆదర్శవంతమైన తెలంగాణ ఏర్పాటుకు దిక్సూచిగా ఉంది. తప్పకుండా ఇది ప్రజా సంక్షేమ బడ్జెట్ అవుతుంది.
– తాటి లింగం, రిటైర్డ్ లెక్చరర్, గజ్వేల్
బ్రాహ్మణ సంక్షేమానికి నిధులు హర్షణీయం
రాష్ట్ర బడ్జెట్లో బ్రాహ్మణ సంక్షేమానికి రూ.177 కోట్లు కేటాయించడం హర్షణీయం. అర్బన్ ప్రాంతాల్లో ధూప దీప, నైవేద్య కమిటీ పథకం వర్తింపజేయడం సంతోషకరం. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు బ్రాహ్మణుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది.
– కలకుంట్ల వెంకటనర్సింహా చార్యులు, సిద్దిపేట జిల్లా ధూప దీప, నైవేద్య అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు
ప్రజల అభ్యున్నతి బడ్జెట్
వ్యవసాయానికి రూ.24,254 కోట్లు ,ఆసరా పెన్షన్లకు 11.728 కోట్లతోపాటు వివిధ వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ తొలిసారిగా రూ.2లక్షల56 వేల కోట్లకు పైగా బడ్జెట్‌ను రూపొందించడం సంతోషకరం. ముఖ్యంగా డబుల్బెడ్రూంల నిర్మాణం, షాదీముబారాక్, కల్యాణలక్ష్మి పథకాల అమలుకు మరింత ప్రాధాన్యమివ్వడం హర్షించదగిన పరిణామం.
– రామలింగారెడ్డి, వైఎస్పార్టీపీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి
అదృష్టాన్ని తిరగరాస్తున్న సర్కారు
దళితబంధుతో తెలంగాణ సర్కారు దళితుల అదృష్టాన్ని తిరగరాస్తున్నది. హజూరాబాద్లోని దళితబంధుతో ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఇప్పుడు యావత్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలుతో పేదబతుకులుగానే మిగిలి పోయిన దళితవాడలు, దళితుల జీవితాలు అద్భుతంగా మారనున్నాయి. ఇది దళితుల జీవితాల్లో గొప్ప చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోనున్నది.
– పొన్నాల కుమార్‌మాదిగ, తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు