సిద్దిపేట అర్బన్, మార్చి 7 : దళితబంధుకు లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న ప్రతి యూనిట్‌కు సంబంధించి సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో దళితబంధు పథకంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.
దళితబంధు పథకం ద్వారా లబ్ధిదారులు లాభదాయక యూనిట్లను ఎంపిక చేసుకొని ఆర్థికంగా ఎదిగేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. దళితబంధు కింద లబ్ధిదారులకు అందించే ప్రతి యూనిట్‌కు సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను అధికారులు వెంటనే సిద్ధం చేయాలన్నారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లకు సంబంధించి క్షేత్ర స్థాయిలో కష్టనష్టాలు, ప్రయోజనాలను వివరించేందుకు ఈనెల 9,10 తేదీల్లో విజిట్లను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, డీఆర్డీవో గోపాల్‌రావు, అదనపు డీఆర్డీవో కౌసల్య, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి సత్యప్రసాద్, ఎంవీఐ సురేశ్ పాల్గొన్నారు.