Medak | రామాయంపేట, ఫిబ్రవరి 14 : మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం సక్రమంగా పెట్టాలని లేకుంటే చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ హెచ్చరించారు. రామాయంపేట తెలంగాణ గురుకుల పాఠశాలను శుక్రవారం అడిషనల్ కలెక్టర్.. పాఠశాలలోని కూరగాయలు, విద్యార్ధులకు వండిన ఆహారంతో పాటు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే అల్పాహారంలో ఎలాంటి తేడాలు ఉండవద్దని అన్నారు.
గురుకులంలో పనిచేస్తున్న సిబ్బంది ఎవ్వరు కూడా సెలవులు పెట్టకుండా సక్రమంగా విద్యా భోదన చేపట్టాలని అడిషినల్ కలెక్టర్ సూచించారు. పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులను తీసుకోవాలని అన్నారు. ఇది పరీక్షల కాలమని కచ్చితంగా ప్రతిరోజు ప్రతి తరగతి గదిలోనే విద్యార్థులకు తరగతులు తీసుకోవాలని సూచించారు. టీచర్లతోనే విద్యార్థులకు చదువు వస్తుందని క్రమశిక్షణతో విద్యార్థులకు సమగ్ర బోధన చేపట్టాలన్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడంతో పాటు ప్రతి క్లాస్ టీచర్ విద్యార్ధులు భోజనం తినే ముందు అక్కడే ఉండి విద్యార్థుల బాగోగులు చూసుకోవాలని అన్నారు.
పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించేలా టీచర్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తరగతి గదులతో పాటు విద్యార్థులు నిద్రించే భవనాలను ఎప్పటికప్పుడు ప్రిన్సిపల్, టీచర్లు సందర్శించాలని తెలిపారు.