
ప్రభుత్వ ప్రోత్సాహం.. కార్పొరేట్‌ను తలదన్నేలా సౌకర్యాలు.. అంకితభావంతో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది.. కేసీఆర్ కిట్ అమలు.. వెరసి మెదక్ జిల్లాకేంద్ర దవాఖాన మంచి రికార్డును సొంతం చేసుకున్నది. రాష్ట్రంలోనే అత్యధిక ప్రసవాలు జరిగిన సర్కారు దవాఖానగా మెదక్ జిల్లాకేంద్ర దవాఖాన గుర్తింపు పొందింది. ఈ దవాఖానలో ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 1467 కాన్పులు జరిగాయి. సీ సెక్షన్లో 1178 డెలివరీలు కాగా, మొత్తం 2645 డెలివరీలతో జిల్లా కేంద్ర దవాఖాన రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. 120 పడకలు ఉన్న ఈ దవాఖానలో నిత్యం 200 పైగా ఓపీ గర్భిణుల కేసులు నమోదవుతున్నాయి. 15 వరకు డెలివరీలు జరుగుతున్నాయి. కాన్పు కోసం ఇక్కడికి వస్తున్న ప్రతి గర్భిణికి మెరుగైన వైద్య సేవలందిస్తున్నారు. దీంతో ఈ దవాఖాన ఆదరణ పొందుతున్నది.
మెదక్, నవంబర్ 2 : సర్కారు దవాఖానలు ప్రసవాల్లో రికార్డులు బద్దలు కొడుతున్నాయి. మెరుగైన వైద్యసేవలు అందుతుండడంతో గర్భిణులు ప్రసవాలకు సర్కారు దవాఖానలకు వస్తున్నారు. మెదక్ జిల్లా కేంద్ర దవాఖానలో ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 1467 కాన్పులు జరిగాయి. సీ సెక్షన్లో 1178 డెలివరీలు కాగా, మొత్తం 2645 డెలివరీలతో జిల్లా కేంద్ర దవాఖాన రాష్ట్ర వ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచింది.
జిల్లా కేంద్ర దవాఖానలో 120 పడకల సామర్ధ్యం..
120 పడకలు కలిగిన మెదక్ జిల్లాకేంద్ర దవాఖానలో కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాతో పాటు పొరుగు జిల్లాలకు చెందిన గర్భిణులు సైతం ఇక్కడికి ప్రసవాలకు వస్తున్నారు. ప్రతిరోజు 200లకు పైగా ఓపీ(గర్భిణులు) కేసులు నమోదవుతుండగా, 12 నుంచి 15 వరకు డెలివరీలు చేస్తున్నారు. గతంలో సర్కారు దవాఖాన అంటేనే సమస్యలకు నిలయంగా ఉండేది. ఇప్పుడు మంచి వైద్యసేవలు అందుతుండడంతో రోగులు క్యూ కడుతున్నారు. ప్రసవాలకు ప్రైవేట్ దవాఖానలకు వెళ్తే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తున్నది. మళ్లీ సిజేరియన్ ఎక్కువగా చేస్తున్నారనే అపవాదు ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్కారు దవాఖానల్లో అందుబాటులో ఆధునాతన వైద్య పరికరాలు, డాక్టర్లు, సిబ్బంది అంకితభావంతో సేవలందిస్తుండడంతో సత్ఫలితాలు వస్తున్నాయి.
పది నెలలు… 1467 కాన్పులు…
మెదక్ జిల్లా కేంద్ర దవాఖానలో ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు పది నెలల్లో 1467 కాన్పులు జరిగాయి. నెలకు 300లకు పైగా డెలివరీలు జరుగగా, ఇందులో మొదటి కాన్పు బాలింతలకు కేసీఆర్ కిట్‌ను అందజేస్తున్నారు. డెలివరీల్లో మెదక్ దవాఖాన రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. అక్టోబర్‌లో 4500 మంది గర్భిణులు ఓపీలో పేర్లను నమోదు చేసుకోగా, 357 మందికి కాన్పులు చేసి రికార్డు సృష్టించారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ పి.చంద్రశేఖర్ పర్యవేక్షణలో గైనిక్, చిన్న పిల్లల వైద్యుల ఆధ్వర్యంలో మెరుగైన సేవలందిస్తూ నెలకు 250 నుంచి 350 కాన్పులు చేస్తున్నారు.
హిట్టవుతున్న కేసీఆర్ కిట్…
2017 జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ కిట్ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. సర్కారు దవాఖానలో డెలివరీ అయితే ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ.12వేలతో పాటు కేసీఆర్ కిట్ అందజేస్తున్నారు. సర్కారు దవాఖానల్లో ప్రసూతి చేసుకున్న వారికి బ్యాంకు ఖాతాల్లో నాలుగు విడతలుగా నగదు జమ చేస్తారు. పీహెచ్సీ పరిధిలో మెడికల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో గర్భిణులు రెండు సార్లు వైద్య పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత మొదటి విడత రూ.4వేలు, దవాఖానలో డెలివరీ అయిన తర్వాత ఆడ బిడ్డ పుడితే రూ.5వేలు, మగబిడ్డ పుడితే రూ.4వేలు రెండు విడతలుగా అందజేస్తారు. గతంలో నెలకు పట్టుమని పది కాన్పులు కూడా చేయని వైద్యులు.. ఇప్పుడు వందల సంఖ్యలో కాన్పులు చేస్తున్నారు.
వైద్యులు, సిబ్బంది సహకారంతోనే..
మెదక్ జిల్లా కేంద్ర దవాఖానలో నెలలో 250 నుంచి 350ల పైచిలుకు వరకు కాన్పులు చేస్తున్నాం. ఇందుకు గాను వైద్యులు, సిబ్బంది పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. అక్టోబర్ నెలలో 357 డెలివరీలు చేశాం. దవాఖానను రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిపాం. డెలివరీ కోసం ఇక్కడికి వస్తున్న ప్రతి గర్భిణికి మెరుగైన సేవలందిస్తున్నాం. ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నది.