
మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 30 : మున్సిపాలిటీల్లో అసెస్మెంట్ల(ఆస్తుల) వివరాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) ప్రత్యేకంగా ‘భువన్ యాప్’ను రూపొందించింది. ఈ యాప్‌లో ఇంటి నంబర్‌తో పాటు వివరాలు నమోదు చేస్తే శాటిలైట్ వ్యవస్థ ఆధారంగా ఆస్తి వివరాలన్నీ కనిపిస్తాయి. ఈ వివరాల లింకులన్నీ ఆ శాఖ ప్రధాన సర్వర్‌కు అనుసంధానమై ఉంటాయి. ఈ నెలాఖరు లోపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను జియో ట్యాగింగ్ చేసే రెండో దశ ప్రక్రియను పూర్తి చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. గతేడాది నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుండగా, మధ్యలో కరోనా కారణంగా నమోదును వాయిదా వేశారు. మూడు నెలలుగా ఈ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. నెలాఖరు వరకు లక్ష్యం పూర్తి చేయాల్సి ఉంది.
69 శాతం పూర్తి..
ఈ నెలాఖరు వరకు భువన్ యాప్‌లో పొందుపర్చాలని ఆదేశాలు ఉన్నా, మెదక్ మున్సిపాలిటీలో మాత్రం ఇప్పటి వరకు 69 శాతం మేరకే పూర్తయింది. పట్టణం లో 11,257 అసెస్మెంట్లు ఉండగా 7,820 మాత్రమే పూర్తి చేశారు. ఈ నెల 20న విడుదల చేసిన సీడీఎంఏ లెక్కల ప్రకారం మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు 100లోపు స్థానాల్లో లేకపోవడం విశేషం. భువన్ యాప్‌లో నమోదుకు సీడీఎంఏ మరింత గడువు పెంచనున్నట్లు సమాచారం.
సర్వే నిర్వహణ ఇలా..
భువన్ యాప్‌ను ఇప్పటి వరకు బిల్ కలెక్టర్ వినియోగించేవారు. సిబ్బంది కొరతతో మున్సిపల్ ఆర్వో, ఆర్ఐ, మేనేజర్లు తదితర సిబ్బందికి శిక్షణనిచ్చారు. సర్వే చేసే వారందరికీ అండ్రాయిడ్ సెల్ఫోన్లు తప్పనిసరి. యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని వారికి కేటాయించిన వార్డు పరిధిలో ఇండ్ల వివరాలు నమోదు చేస్తారు. భవనంపైకి వెళ్లి జీఐఎస్ ద్వారా యాప్‌లో ఇంటి నంబర్‌ను నమోదు చేయాలి. సెర్చ్ అనే చోట క్లిక్ చేస్తే ఆ నివాసం హద్దులు, అకాంశాలు, రేఖాంశాలతో సహా కనిపిస్తాయి. వాటిని ఫొటో తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తారు. ఒకవేళ అది పెంకుటిళ్లు, రేకుల ఇల్లు అయితే గుమ్మం ముందు నిల్చొని ఫొటో తీసి శాటిలైట్ వివరాలు నమోదు చేస్తారు. నల్లాల కనెక్షన్లను లెక్కిస్తారు. దీంతో భవనం, ఇల్లు ఏదైనా వాస్తవ ఆధారాలనే నమోదు చేసే వీలుంటుంది. దీంతో ఆస్తి పన్ను మదింపు పక్కాగా ఉంటుంది. పురపాలికలకు ఆదాయం పెరుగుతుంది.
చేతి వాటానికి తావు ఉండదు..
ఇంటి పన్ను మదింపులో మున్సిపల్ సిబ్బంది, ఆస్తి యజమాని కుమ్మక్కయ్యే అవకాశాలుండవు. భువన్ యాప్‌లో ఉన్న ఆ ఇంటి ఫొటోతో ఎన్ని అంతస్తులు ఉన్నాయి. అసలు అనుమతి ఎన్నింటికి ఉంది తదితర విషయాలు తెలుస్తాయి. తద్వారా ఆస్తిపన్ను చెల్లింపులో అక్రమాలకు తావుండదు. కేవలం ప్రైవేట్ ఆస్తులే కాకుండా ప్రభుత్వ ఆస్తుల సమస్త సమాచారం క్రోడీకరిస్తారు. పట్టణంలో వీధి దీపాలు, నీటి సరఫరా వ్యవస్థ తదితర 46 అంశాల వివరాలు పురపాలిక బేస్మ్యాప్లో నమోదవుతాయి. జియో ట్యాంగింగ్ ద్వారా మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను ఆదాయం పెరుగుతున్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
పది రోజుల్లో పూర్తిచేస్తాం..
భువన్ యాప్‌లో నమోదుతోపాటు జియో ట్యాగింగ్ చేయడం 69 శాతం పూర్తయింది. మూడు నెలలుగా నిరంతరంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. సిబ్బంది కొరతతో ఈ నెలాఖరు వరకు నమోదు చేయలేక పోయాం. మరో పది రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేస్తాం.
-శ్రీహరి, మున్సిపల్ కమిషనర్, మెదక్