
మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 29 : కొవిడ్ కారణంగా మూతపడిన పాఠశాలలు సెప్టెంబర్ 1 నుంచి పునః ప్రారంభమయ్యాయి. చాలా రోజుల తర్వాత బడి బస్సులు రోడెక్కాయి. రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించిన తర్వాతనే బస్సులు నడిపించాలి. కానీ, కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 31 వరకు ఇచ్చిన వెసులుబాటును సాకుగా చూపి చాలా యాజమాన్యాలు బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించుకోలేదు. ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించుకునేందుకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి పాఠశాల బస్సుకు రవాణా శాఖ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి ఫిట్నెస్ ధ్రువపత్రం ఇవ్వాల్సి ఉంటుంది. కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం వాహన ఫిట్నెస్ పరీక్షల విషయంలో ఈ నెలాఖరు వరకు అవకాశం కల్పించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రవాణా శాఖ పాఠశాలల బస్సుల ఫిట్నెస్ పరీక్షల విషయంలో పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. మెదక్ జిల్లాలో 364 బస్సులు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు135 బస్సులు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు చేయించుకున్నాయి. మిగతా 229 బస్సులు ఈ నెలాఖరు వరకు చేయించుకోవాల్సి ఉంది.
నిబంధనలు ఇవీ..
బస్సు 15 ఏండ్ల కాల పరిమితి దాటకూడదు.
కుడి, ఎడమ వైపు పాఠశాల పేరు, చిరునామా ఉండాలి.
వాహనం ఆగితే బ్లింక్ అయ్యేలా పైభాగంలో నాలుగు వైపులా లైట్లు ఉండాలి.
సైడ్లకు పసుపు రేడియం స్టిక్కర్లతో పాటు ముందు తెలుపు, వెనుక ఎరుపు స్టిక్కర్లు అతికించి ఉండాలి.
అత్యవసర ద్వారం ఉండాలి.
ప్రథమ చికిత్స పెట్టె, మంటలను ఆర్పే వ్యవస్థ కలిగి ఉండాలి.
సీట్ల కింద బ్యాగులు పెట్టుకోవడానికి ర్యాక్‌లు తప్పనిసరి.
వాహనం ముందు, వెనుకబడి పిల్లల ఛాయచిత్రాలు స్పష్టంగా పెద్దగా ఉండాలి.
కిటికీకి అడ్డంగా మూడు ఇనుప కడ్డీలు ఉండాలి.
నేల నుంచి 325 మి.మీ ఎత్తులో మెట్లు, ఎక్కేందుకు హ్యాండ్ రెయిలింగ్ ఉండాలి.
ఇంజిన్, క్లచ్, గేర్లు పూర్తి సామర్థ్యంతో ఉండాలి.
ఫిట్నెస్ లేకుండా నడిపిస్తే చర్యలు
పాఠశాలల బస్సులు ఫిట్నెస్ లేకుండా రో డ్లపై నడిపిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రతి పాఠశాల బస్సులు తప్పకుండా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించుకోవాలి. ప్రభుత్వం ఈ నెల 31 వరకు వెసులుబాటు కల్పించింది. ఆ లోపు ఫిట్నెస్ చేయించాలి. ఒకవేళ ఫిట్నెస్ పొందకుండా రోడ్లపైకి వస్తే సీజ్ చేస్తాం.
-శ్రీనివాస్‌గౌడ్, రవాణాధికారి, మెదక్ జిల్లా