
జగదేవ్పూర్, అక్టోబర్ 28 : హరితహారం కార్యక్రమం అమలుతో ఆహ్లాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు ఏడు విడతలుగా సాగిన హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి నీడను, చల్లని గాలిని, ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నాయి. పల్లెలు, పట్టణాలు హరితశోభను సంతరించుకున్నాయి. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో మల్టీలెవల్ అవెన్యు ప్లాంటేషన్లో భాగంగా వేలాది మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. గజ్వేల్ భువనగిరి ప్రధాన రోడ్డు వెంబడి నిర్మల్నగర్ 3141, అలిరాజ్పేట 2072, జగదేవ్పూర్ 2865 , లింగారెడ్డిపల్లె 1407, పీర్లపల్లి 346 8 మొక్కల చొప్పున నాటి సంరక్షిస్తున్నారు. ఈ 5 గ్రామాల పరిధిలో రహదారులకు ఇరువైపులా రెం డు నుంచి నాలుగు వరుసల్లో 10 నుంచి 13 రకాల మొక్కలు నాటారు. మొక్కలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో రహదారులకు కొత్త అందాలను సంతరించుకున్నాయి. అలిరాజ్పేట, నిర్మల్నగర్ గ్రామాల పరిధిలో నాలుగు వరుసల్లో 10 రకాల మొక్క లు నాటారు. వేప, మర్రి, కదంబం, పొగడ, బిగ్నోనియా, స్పెథోడియా, మద్ది, ఆకాశమల్లే, రావి మొక్కలు నాటారు. 9 మంది వాచర్లతో ఈ మొక్కలను సంరక్షిస్తున్నారు. అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుండడంతో సత్ఫలితాలు వస్తున్నాయి.