
సగటు జీవి జీవితమంతా పెట్రోల్, డీజిల్‌కే అయిపోతుంది. చమురు కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నాయి. అసలే కరోనా వల్ల నానా ఇబ్బందులు పడుతున్న దేశ ప్రజలను చమురు కంపెనీలు మరిన్ని కష్టాలోకి నెట్టుతున్నాయి. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ పెరుగుతూనే వస్తున్నాయి. అంతేకాకుండా కూరగాయల ధరలు మరింత పిరమైపోయాయి.
గతంలో విక్రయించిన ధరలకంటే కిలోకు రూ.20 పెరిగింది. దీంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఇదిలావుండగా నిత్యావసర ధరలు కూడా ఆకాశానంటుతున్నాయి. మరోవైపు గ్యాస్ ధరలు కూడా అమాంతం పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
మెదక్ జిల్లాలో కూరగాయల ధరలు చూస్తే జనం హడలిపోవాల్సి వస్తోంది. ఒకవైపు నిత్యావసర ధరలు కొనుగోలు చేసి అవస్థలు పడుతుంటే ప్రస్తుతం కూరగాయల రేట్లు సామాన్యులను భయపెట్టిస్తున్నాయి. 15 రోజుల నుంచి ప్రతిరోజు రేట్లు పెరుగుతూ వచ్చాయి. ఆకు కూరల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది. పది రోజుల క్రితం కిలో టమాట రూ.20 ఉండగా ప్రస్తుతం రూ.50 వరకు అమ్ముతున్నారు. కిలో మిర్చి రూ.40కి చేరింది. నిత్యావసర వస్తువులైన పప్పులు ధరలు కూడా పెరిగాయి. మార్కెట్లో కందిపప్పు రూ.105 కాగా, పెసరపప్పు రూ.105, మినుప పప్పు రూ.110, శనగ పప్పు రూ.70, ఎర్ర పప్పు రూ.95కు ఎగబాకింది. దీంతో ఇంట్లో ఏవైనా పిండి వంటలు చేసుకుందామనుకుంటే గృహిణులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా అన్ని రకాల ధరలు పెంచడంపై కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
పెరుగుతున్న చమురు ధరలు
చమురు ధరలు పెరుతున్నాయి. వంటింట్లో ధరల కుంపటి మండిపోతున్నది. కేంద్ర ప్రభుత్వం ఎవరేమైతే మాకేంటి అన్నట్లుగా వ్యవహరిస్తూ రోజురోజుకూ
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేస్తున్నది…
పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పెనుభారం పడింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తరచూ ధరలను పెంచుతున్నది. తాజాగా లీటర్ పెట్రోల్ రూ.113.02, డీజిల్ రూ.106.16కు చేరింది. దీంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. బైక్ తీయాలంటే భయపడుతున్నారు. మరోవైపు వంటగ్యాస్ ధర రూ.వెయ్యి దాటుతున్నది. ప్రస్తుతం రూ.972కి (డెలివరీ చార్జి అదనం) పెరిగింది. కేంద్ర ప్రభుత్వం క్రమంగా సబ్సిడీ తగ్గిస్తుండడంతో సామాన్యులకు సిలిండర్ గుదిబండలా మారింది. చమురు ధరలు ఆకాశాన్నంటుతుండడంతో నిత్యావసర సరుకుల ధరలు కూడా అదేబాట పట్టాయి. పప్పు, ఉప్పు, కారం ఇలా ప్రతీదీ రవాణాతో ముడిపడి ఉండడంతో ఆయా ధరలు కూడా పెరిగాయి. ఈ అవస్థలకు తోడు కూరగాయలు, ఆకు కూరల రేట్లు సైతం సామాన్యులను భయపెట్టిస్తున్నాయి. మండుతున్న ధరలకు పేదప్రజలపై పెనుభారం పడుతుండడంతో తలలు పట్టుకుంటున్నారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా బీజేపీ పాలకులు వ్యవహరిస్తుండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చమురు ధరలపై నియంత్రణ ఉండాలి..
చమురు కంపెనీలు పెట్రో ధరల పెంపు నియంత్రణ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండాలి. కంపెనీలకు ధరల పెంపు స్వయం ప్రతిపత్తి కల్పించడంతో ఇష్టం వచ్చిన విధంగా పెంచుతున్నారు. దీంతో రోజువారీ కార్యక్రమాలు చేసుకునే సామాన్య మానవుడిపై పెట్రో ధరఘాతం పడుతున్నది. కూరగాయలు, పాలు, పండ్లు, నిత్యావసర వస్తువుల ధరలకు అడ్డులేకుండా పోతున్నది. ఒక్క పెట్రో ధరలు పెరిగితే ఇతర వస్తువులపై ధరల భారం పడుతున్నది. ప్రజలపై పడుతున్న అధిక ధరలను నియంత్రించి భారం తగ్గించాలి.
మెదక్ జిల్లాలో 1,98,358 గ్యాస్ కనెక్షన్లు..
మెదక్ జిల్లా వ్యాప్తంగా 1,98,358 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 16 ఏజెన్సీల ద్వారా సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో గ్యాస్ ధర రూ.773.50 ఉండగా, సెప్టెంబర్ నాటికి రూ.954కు పెంచారు. తాజాగా 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను రూ.972గా నిర్ణయించారు. సిలిండర్ తీసుకున్న తర్వాత వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో రాయితీ సొమ్ము జమ చేస్తున్నారు. కరోనాకు ముందు ఒక సిలిండర్‌పై రూ.280 రాయితీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేవలం రూ.40 మాత్రమే జమ చేస్తోంది. గతంలో నెలనెలా గ్యాస్ సబ్సిడీ బ్యాంకు ఖాతాలో జమవుతుండగా, సెప్టెంబర్ నెలలో ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదని వినియోగదారులు వాపోతున్నారు.
పెరిగిన గ్యాస్ ధర..
వంట గ్యాస్ ధరలు మరోమారు పెరిగాయి. చమురు సంస్థల నిర్ణయం మేరకు ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ.15 పెరగడంతో ధర రూ.972కు చేరింది. దీనికి తోడు స్థానిక నిర్వాహకులు ట్రావెల్, ఇతర చార్జీల కింద రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఫిబ్రవరి 15 నాటికి రూ.840 ఉన్న వంట గ్యాస్ ధర ఎనిమిది నెలల సమయంలో ఏకంగా రూ.132కు పెరిగింది. దీంతో సామాన్య ప్రజలు విలవిలలాడుతున్నారు. 2020 అక్టోబర్ నెలలో పెట్రల్ లీటరుకు రూ.84.41 ఉండగా, డీజిల్ రూ.77.05 ఉండేది. ప్రస్తుతం పెట్రల్ ధర రూ.113.02, డీజిల్ ధర రూ.106.16కు పెరిగింది. దీంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
రోజువారీగా పెట్రోల్.. నిత్యావసరాల ధరలు..
సిద్దిపేటలో నేడు (బుధవారం) పెట్రోల్ ధర లీటరుకు. రూ.112.78, డీజిల్ ధర లీటరు 105.93 ఉన్నది. కూలి పనులు చేసుకునేవారు మెటారు సైకిళ్లు నడపడం గగనంగా మారిందని వాపోతున్నారు. నెల మొదటి నుంచి పెరుగుతున్న చమురు ధరలు ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి. తేదీల వారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు అక్టోబర్ 1న పెట్రోల్ లీటర్‌కు రూ.106.70, డీజిల్ లీటర్‌కు రూ.99.05 ఉండగా, నేడు పెట్రోల్ రూ.112.78, డీజిల్ రూ.105.93 పెరిగింది. వంట గ్యాస్ ధర 14.2 కిలోల బండకు రూ.970.50కు పెరిగింది. కాగా, నిత్యావసరాలైన కూరగాయల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రైతు బజారులో కిలో టామట ధర బుధవారం రూ.36, మిర్చి కిలో రూ.32, బీరకాయలు కిలో రూ.54, చిక్కుడుకాయ కిలో రూ.60, క్యాప్సికం కిలో రూ.60, బెండకాయ కిలో రూ.34, వంకాయ కిలో రూ.30, బీర్నిస్ కిలో రూ.60, క్యారెట్ కిలో రూ.50 పలుకుతుంది. గత నెల నుంచి కూరగాయలు ధరలు సూమరుగా రూ.6 నుంచి రూ.15 వరకు పెరుగుతుండటంతో పేదలు కూరగాయలు కొనేందుకు జంకుతున్నారు.
సంగారెడ్డిలో ఆగని పెట్రోల్ ధర..
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడయిల్ ధరలు పెరగడంతో దేశ వ్యాప్తంగా చమురు ధరలు పెంచక తప్పడంలేదని బీజేపీ పాలకులు సర్దిచేపుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలను వ్యతిరేకించేందుకు గతంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు దేశవ్యాప్తంగా నిరసన తెలిపేందుకు భారత్ బంద్‌కు పిలుపునిచ్చి విజయవంతం చేశాయి. అయినా కేంద్ర ప్రభుత్వంలో మార్పు రాకపోవడంతో పాటు రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ వచ్చింది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో పెట్రోల్ లీటరు ధర రూ.112.86 పైసలు, డీజిల్ లీటరు ధర రూ.106.67 పెరిగినా.. వాహనదారులు తిరుగక తప్పదని వాహనాల్లో పెట్రోల్, డీజిల్ పోసుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు.
కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి..
వారం రోజుల్లోనే కూరగాయల ధరలు భారీగి పెరిగాయి. దీంతో కూరగాయలను ఎక్కువగా కొనలేకపోతున్నాం. గతంలో వారానికి రూ.300 సరిపోయేవి. ఇప్పుడు రూ.500 దాటుతోంది. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం.
పెట్రోల్, డీజిల్ పెంచిన ఘనత కేంద్రానికే..
ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్న ఘనత కేంద్ర ప్రభుత్వానికే దక్కింది. వాహనంలో ఒక లీటరు పెట్రోల్ పోసుకుంటే కనీసం 40 కిలోమీటర్లు కూడా రావడం లేదు. ఇకపోతే ధాన్యాన్ని పొలం నుంచి ఇంటి వరకు ట్రాక్టర్లలో తీసుకెళ్లాలంటే ఒక లోడ్‌కు రూ.600 చెల్లించాల్సి వస్తోంది. డీజిల్ ధరలు పెరగడం ఏమోగానీ రైతు బతుకులు ఆగమవుతున్నయ్.
డీజిల్ ధర పెరడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాం
గతంలో నా ఆటోలో దుబ్బాక నుంచి సిద్దిపేటకు రావడానికి రూ.120 డీజిల్ పోయించే వాడిని. కానీ నేడు రూ.250 డీజిల్ పోయాల్సి వస్తుంది. ధరలు ఏమో పెరిగె.. చార్జీలు ఏమో పెరుగకా పాయె.. చార్జీలు పెంచితే ప్రజలు ఆటో ఎక్కే పరిస్థితి లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం.