
ఆ ఊరిలో రైతులందరిదీ ఒకటే మాట.. ఒకటే బాట. ఒకరిద్దరూ కాదు..ఊరంతా ఆరుతడి పంటలు సాగుచేస్తారు. ఏండ్ల నుంచి కూరగాయలు, అరుతడి పంటలపై ఇక్కడి రైతులు దృష్టిసారించారు. తక్కువ సమయంలో కొద్ది పెట్టుబడితో మంచి దిగుబడులు సాధిస్తూ ఆదాయం పొందుతున్నారు. దీనికి తోడూ పాల ఉత్పత్తి చేపడుతూ పాడిపరిశ్రమను అభివృద్ధి చేసుకున్నారు. దీంతో మంచి ఆదాయం పొందుతున్నారు. కోతుల బెడద కారణంగా గతేడాది నుంచి ఆకుకూరలు, కూరగాయల సాగును తగ్గించినట్లుగా చెబుతున్నారు. కేవలం తిండి కోసం ప్రతి యాసంగిలో పది, ఇరవై గుంటల్లో మాత్రమే సన్నవడ్లను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ సోయ, వేరుశనగ, బబ్బెర, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, మిర్చి, కొత్తిమీర, పుదీనా, మెంతి సాగుచేస్తున్నారు. పండించిన ఉత్పత్తులను కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, హుస్నాబాద్ మార్కెట్లకు తరలించి హోల్సేల్ ధరలకు విక్రయిస్తున్నారు.
అక్కన్నపేట, నవంబర్ 17: ఆరుతడి పం టలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం పోతారం(జే) పరిధిలోని తురుకవానికుంట రైతులు. తురుకవానికుంటలో విపరీతంగా ఉన్న కోతల బెడద కారణంగా ఏడాది నుంచి ఇక్కడి రైతులు కూరగాయలు,ఆకుకూరల సాగును తగ్గించారు. ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లారు. వేరుశనగా, బబ్బెర, పెసర్లు, నువ్వులు, పొద్దుతిరుగుడు, శనగ, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, మెంతి, మినుములు, పచ్చిమిర్చి సాగుచేస్తున్నారు. పాడిపరిశ్రమలోనూ ఈ గ్రామ రైతులు ముందున్నారు. గ్రామ పాలకేంద్రంలో నిత్యం 300 లీటర్ల వరకు పాలుపోస్తున్నారు.
పల్లె చిన్నది..
పోతారం(జే) గ్రామ పంచాయతీ పరిధిలోని తురుకవానికుంటలో కేవలం 49 వరకు ఇండ్లు మాత్రమే ఉన్నాయి. ఈ గ్రామానికి చెందిన 25 మంది వరకు ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తుండగా, మరో 15 మంది ప్రైవేటు రం గంలో పనిచేస్తున్నారు. సుమారు 50మంది రైతులు ఊరిలో ఉండి వ్యవసాయం చేస్తున్నారు. ఇందులో 40 మంది రైతులు పూర్తిగా ఆరుతడి పంటలు సాగుచేస్తున్నారు. ఎక్కువగా ఉల్లిగడ్డ, కొత్తిమీర, మెంతి, పుదీనాతో పాటు పాల ఉత్పత్తిని చేస్తుండగా, మరో పది మంది రైతులు కేవలం పాడిపరిశ్రమ చేపడుతున్నారు. ఈ ఊరిలో సాగు పనుల్లో ఇతర కూలీలు, జీతగాళ్లు లేకుండా కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే పనులు చేసుకోవడం విశేషం.
మూడెకరాల్లో పల్లికాయ వేసిన..
ఇటీవల నా భర్త చనిపోయాడు. మాకున్న మూడెకరాల భూమిలో పల్లికాయ వేసిన. పల్లి చేన్ల స్ప్రింకర్లు పెట్టిన. వారానికోసారి నీళ్లు పెడితే సరిపోతుంది. పల్లికి రోగం వస్తే ఒకటి, రెండుసార్లు మందు కొడితే పోతుంది. పెట్టుబడి కూడా వరితో పోల్చితే తక్కువే. పల్లి విత్తనాలు సబ్సిడీపై తీసుకొచ్చిన. విత్తన గింజలు మంచిగా ఉన్నయ్. మంచి దిగుబడి వస్తే వరి సాగుకు నాలిగింతల దిగుబడి పల్లికాయల వస్తుంది. మార్కెట్ల పల్లికాయకు మంచి ధర ఉంది.
-రంగు అండాలు, మహిళా రైతు, తరుకవానికుంట (సిద్దిపేట జిల్లా)
పొద్దుతిరుగుడు విత్తనాలు ఇవ్వాలి..
సీఎం కేసీఆర్ ఏది చెప్పినా రైతుల మంచికే చెప్తడు. మొదటి నుంచి కూడా మా ఊల్లో రైతులందరం పంటల విషయంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటాం. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని అందరం ఆలోచన చేసినం. వరితో పోల్చుకుంటే కూరగాయలు, ఆకుకూరలు ఆరుతడి పంటల సాగు లాభదాయకంగా ఉంటుంది. మార్కెట్లో పొద్దుతిరుగుడు విత్తనాలు అందుబాటులో లేవు. వ్యవసాయ శాఖ అధికారులు అరుతడి పంటలకు సంబంధించిన విత్తనాలు అందుబాటులోకి తీసుకురావాలి.